SGSTV NEWS online
CrimeNational

ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!



సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం.. ప్రేమ పేరిట ఆకర్షణ.. ఇవన్నీ యువతపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయో చెప్పేందుకు ఈ ఘటన మరో ఉదాహరణ. తమకు నచ్చిన వ్యక్తి కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో కొందరు హద్దులు దాటుతున్నారు. క్షణికమైన కోరిక కోసం తీసుకునే నిర్ణయాలు.. చివరికి జీవితాన్నే మార్చే పరిణామాలకు దారితీస్తున్నాయి. తమ ప్రేమను నిరూపించుకోవాలనే తాపత్రయంలో ఓ యువతి చేసిన పని ఇప్పుడు ఆమెను కటకటాల వెనక్కి నెట్టింది.

ప్రియుడి మనసులో చోటు కోసం ఓ యువతి వెంపర్లాడింది. అతనికి ఉన్న ఖరీదైన బైక్ కలను నెరవేర్చాలని అనుకుంది. ఈ క్రమంలోనే ఆ కాలేజీ విద్యార్థినిని దొంగగా మారి.. తండ్రి పరువు తీసేసింది. తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.

స్థానికంగా కాలేజీ చదువుతున్న ఓ యువతి.. ఓ అబ్బాయిని ఇష్టపడుతోంది. అతను కూడా ఆమెతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఖరీదైన బైక్ ఎప్పటికైనా కొనుక్కోవాలని అతను తరచూ ఆమెకు చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఓరోజు తన తండ్రి స్నేహితుడైన హెచ్. తమిళ్సెల్వన్ ఇంటికి వెళ్లింది. అక్కడ అల్మారాలో బంగారం ఉన్న విషయం గుర్తించింది. వాళ్ల కళ్లు గప్పి.. 9 సవర్ల బంగారు నగలను చోరీ చేసింది.

ఆపై ఆ నగలను స్థానిక దుకాణంలో రూ.2.5 లక్షలకు విక్రయించింది. ఆ వచ్చిన డబ్బుతో తన ప్రియుడు జనగన్ శివకు ఓ కాస్ట్ బైక్ కొనిచ్చింది. అంతేకాదు.. సంతోషంగా సర్ప్రైజింగ్ క్షణాలను వీడియోగా తీసి సోషల్ మీడియాలోనూ పంచుకుంది.

ఇంట్లో బంగారు నగలు కనిపించకపోవడంతో తమిళ్సెల్వన్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో.. స్నేహితుడి కూతురిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. విచారణలో తానే బంగారం తీసుకున్నట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు ఆమె ప్రియుడు జనగన్ శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.

ప్రియుడికి బైక్ కొనివ్వాలన్న కోరికతో మొదలైన వ్యవహారం.. చివరకు దొంగతనం, అరెస్టు వరకు వెళ్లింది. క్షణికమైన ప్రేమ, ఆకర్షణ కోసం తీసుకున్న ఓ నిర్ణయం.. ఇప్పుడు ఆ యువతి జీవితానికే చేదు అనుభవంగా మారింది. ఇప్పుడీ కేసు.. ఆమె బైక్ కొనిచ్చిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

Also read

Related posts