SGSTV NEWS online
Andhra PradeshCrime

సోషల్ మీడియా లో పరిచయం.. మాయమాటలతో వల




అమరావతి -పట్టాభిపురం: గుంటూరులో బాలిక కిడ్నాప్ కేసు పోలీసులకు సవాల్గా మారింది. 15 ఏళ్ల బాలికకు ఇన్స్టాలో పరిచయమైన యువకుడు మాయమాటలతో ఆమెను తీసుకెళ్లిపోయాడు. మూడు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి.. స్థావరాలు మారుస్తూ పలు రాష్ట్రాలు తిరుగుతున్నారు. బాలిక ఆచూకీ కనిపెట్టడంలో విఫలమైనందుకు హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సిట్ ఏర్పాటు చేశారు. బాలిక అదృశ్యం కేసును గురువారం రాత్రి కిడ్నాప్ కేసుగా మార్చారు. నగరంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికకు కొన్నాళ్ల క్రితం ఇన్స్టాలో పర్చూరుకు చెందిన షేక్ జాన్సైదా (28) పరిచయమయ్యాడు. సంపన్న కుటుంబానికి చెందిన బాలికను మభ్యపెట్టి ఆకర్షించాడు. రోజూ మాదిరిగానే జూన్ 9న ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన బాలిక.. తాను తల్లిదండ్రులు నిర్వహిస్తున్న దుకాణం వద్దకు వెళ్తున్నానని అమ్మమ్మకు చెప్పి బయటకు వెళ్లింది.

ఇంట్లోంచి బంగారం, నగదు తీసుకెళ్లింది. తిరిగి రాకపోవడంతో తండ్రి కుమార్తె కోసం పలు ప్రాంతాల్లో గాలించారు. చివరకు జూన్ 10న పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదే రోజు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. జాన్ సైదా ఆమెను బైక్పై తీసుకెళ్లినట్లు గుర్తించారు. అప్పటి నుంచి బాలికను వెతికి పట్టుకునేందుకు ఎస్సై ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. సిట్ బాలిక తల్లిదండ్రులతో కలిసి పర్చూరు, నెల్లూరు, కోయంబత్తూరు, కేరళంలోని పాలక్కాడ్ ప్రాంతాల్లో గాలించారు. అక్కడి సీసీ ఫుటేజీలు, లాడ్జిల్లో సేకరించిన సమాచారం ఆధారంగా వారు చివరికి సికింద్రాబాద్ వచ్చినట్లు గుర్తించారు. అక్కడి నుంచి బేగంపేట రైల్వేస్టేషన్ చేరుకుని ఆటో ఎక్కి వెళ్లిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికీ వారి ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు.

చేతినిండా డబ్బుతో స్థావరాలు మారుస్తూ..

బాలిక ఇంటి నుంచి వెళ్లే సమయంలో నగదు, నగలు

భారీగా తీసుకెళ్లడం జాన్సైదాకు వరంగా మారింది.

ఎక్కడా ఆన్లైన్ చెల్లింపులు చేయకుండా జాగ్రత్త

పడుతున్నాడు. చేతినిండా డబ్బు ఉండటంతో నగరాలు,
స్థావరాలు మారుస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నాడు. ఇప్పటికే పది వరకు సెల్ఫోన్ లో  సిమ్లు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. వేర్వేరు సోషల్ మీడియా ఖాతాలు తెరిచి, మెసేజ్ లు పంపడానికి వినియోగిస్తున్నాడు. దీంతో పోలీసులు ఐపీ చిరునామాలు తెలుసుకుని వారున్న ప్రాంతానికి
చేరుకునేసరికి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.
తమిళనాడులో ఓ లాడ్జిలోని సీసీ కెమెరాలో బాలిక, జాన్సైదా ఉన్న ఫుటేజీని కనిపెట్టారు. అక్కడి నుంచి  కేరళంలోని పాలక్కాడ్ రైల్వేస్టేషన్కు చేరుకుని  సికింద్రాబాద్ రైలు ఎక్కినట్లు గుర్తించారు. మీకు
చేతనైతే పట్టుకోవాలని ఐదు రోజుల కిందట
జాన్సైదా.. బాలిక తల్లిదండ్రులకు ఇన్స్టా ఖాతా ద్వారా  సవాల్ విసిరాడు. ఇన్స్టా ఖాతా నుంచి తల్లికి మిస్డ్ కాల్  రావడంతో.. వాటి ఆధారంగా సాంకేతికతను వినియోగించి నిందితుడిని పట్టుకునే ప్రయత్నించారు.’సాంకేతిక నిపుణుల సాయంతో నిందితుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని, వీలైనంత త్వరగా పట్టుకుంటా’మని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఈ కేసును లవ్ జీహాద్ పరిగణించలేమని, వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరారు.





Related posts