మహారాష్ట్రలోని లోహగఢ్ కోట సమీపంలో జరిగిన కేతన్ అగర్వాల్ (26) మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించిన ఈ ఘటన.. అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పన్నిన క్రూరమైన హత్య కుట్రగా తేలడం అందర్నీ షాక్‌కు గురిచేసింది.
తన కాబోయే భార్య సియాను ఎంతగానో ప్రేమించిన కేతన్ ఆమె పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆమెతో ఏడు అడుగులు వేయాలని కలలు కంటున్న తరుణంలో జూన్ 18న సియా చేతిలో హత్యకు గురయ్యాడు. మొదట అతడు కాలు జారి పడిపోయాడని అందరూ భావించారు.
సోదరి అనుమానంతో గుట్టు రట్టు
కానీ, కేతన్ అంత్యక్రియలు జరిగిన నాలుగు రోజుల తర్వాత సియా వారి కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చినపుడు అనుమానం మొదటైంది. ఆ సమయంలో ఆమె చెప్పిన వివరాలలో తేడాలు ఉండటాన్ని కేతన్ సోదరి గమనించింది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు సియా ఫోన్ రికార్డులను పరిశీలించడంతో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.
6 నెలల్లో 2004 కాల్స్
సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి గత ఆరు నెలల్లో ఏకంగా 2,004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారు. మొత్తం 238 గంటలకు పైగా ఫోన్ కాల్స్‌లో గడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కాల్ డేటానే ఈ హత్య కుట్రను ఛేదించడానికి కీలక ఆధారంగా మారింది.
పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
ఘటన జరిగిన రోజు చేతన్ చౌదరి తన లొకేషన్ దొరకకూడదని చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5:40 గంటల వరకు తన ఫోన్ ఇంటర్నెట్ కనెక్షను ఆపివేశాడు. తన మొబైల్ ఫోన్‌ను ఎవరూ ట్రాక్ చేయకుండా తన దుకాణంలోనే వదిలేశాడు.
లోహగఢ్ కోటకు వెళ్లేటప్పుడు తన దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి మొబైల్ ఫోన్‌ను తీసుకు వెళ్లాడు. అయితే, పోలీసులు డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ/సర్వైలెన్స్ డేటా ద్వారా అతడు అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించారు. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరినీ కోర్టు జూన్ 29 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది.
మండుటెండలో హుడీ
సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం 33 డిగ్రీల సెల్సియస్ మండుటెండలో ట్రెకింగ్ చేస్తుండగా హుడీ ధరించిన వ్యక్తి అనుమానాస్పద కదలికలు,ఇంత ఎండలో హైకింగ్‌కు వెళ్లేటప్పుడు ఎవరైనా హుడీ ఎందుకు ధరిస్తారనే అనుమానమే ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. పోలీసుల కథనం ప్రకారం, కోట వద్ద కేతన్, అతని కాబోయే భార్య సియా కలిసి నడుస్తుండగా సీసీటీవీలో కనిపించింది. సియా ప్రియుడైన చేతన్ చౌదరిగా గుర్తించబడిన మరో వ్యక్తి, వారికి సుమారు 20 నుండి 30 అడుగుల దగ్గర నుండి వారిని ఫాలో అయ్యాడు. అతను షార్ట్స్, ముఖాన్ని కప్పివేసే హుడీ ధరించి కనిపించాడు. హుడీపై హెడ్సెట్ కూడా పెట్టుకున్నాడు.
మరో సీసీటీవీ ఫుటేజ్‌లో, సియా అకస్మాత్తుగా హుడీ ధరించిన వ్యక్తి వైపు వెనక్కి తిరిగి చూసి, వెంటనే కూర్చుండిపోయింది. సియా, చేతన్ల మధ్య బలమైన సంబంధం ఉందని, పక్కా ప్రణాళికతో పన్నిన కుట్ర అని కూడా టెక్నికల్ డేటా ద్వారా తేలింది.
అపుడే తోసేసింది..కానీ
కేతన్, సియాలు మే 31, జూన్ 14 జూన్ 18 తేదీలలో మూడుసార్లు లోహగడ్ కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. కేతన్ హత్యకు కొన్ని రోజుల ముందు, అంటే గత నెలలో, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం కేతన్, సియా బాలికి వెళ్లాల్సి ఉంది. అయితే, ముంబై విమానాశ్రయంలో తన పాస్ పోర్ట్ కనిపించడంలేదని డ్రామా ఆడింది. సియా కావాలనే పాస్‌పోర్ట్‌ను దాచిపెట్టి ఆ ప్రయాణాన్ని అడ్డుకుందని బాధితుడి తండ్రి ఆరోపించారు.
ఆ తర్వాత లోహగడ్ కోటకు వెళ్ళినప్పుడు, జూన్ 14న సియా కేతన్‌ను హత్యకు తొలిసారి ప్రయత్నించి విఫలమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొండపై నెంచి అతణ్ని నెట్టేసింది. అయితే అతను కొండ అంచున ఉన్న పొదను పట్టుకుని ప్రాణాలు కాపాడుకో గలిగాడు. తన చర్యను కప్పిపుచ్చుకోవడానికి, పాము కనిపించిందని అరుస్తూ అందరి దృష్టి మళ్లించి, ఆపై అతన్ని వాటేసుకుని బావురుమంటూ నాటకం ఆడింది.
అలా తొలి ప్రయత్నం విఫలం కావడంతో ఈసారి ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసి కేతన్‌ను మట్టుబెట్టారు. అంతేకాదు ఒకవేళ అనుకున్నట్టు జరగకపోతే, ‘ప్లాన్ సి’ (మూడో ప్లాన్) కూడా సిద్ధం చేసుకున్నారట.
మరోవైపు,చేతన్ తరపు న్యాయవాది రామ్ షహానే ఈ ఆరోపణలను ఖండించారు. ఎఫ్ఐఆర్ చేతను ఈ మరణంతో సంబంధం ఉన్నట్లు ఎక్కడా ప్రత్యక్ష ఆధారాలు లేవని, ఘటన జరిగిన సమయంలో అతడు లోహగఢ్ ప్రాంతంలో ఉన్నట్లు ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ లేదా పత్రాలను పోలీసులు చూపించలేదని వాదించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో మరిన్ని డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. సియా ఒక బేకరీని నడుపుతుండగా, చేతన్ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసేవాడు.
కాగా మహారాష్ట్రకు చెందిన ప్రముఖవ్యాపారవేత్త కుమారుడైన కేతన్, సియాల నిశ్చితార్థం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ప్రైవేట్ జెట్లు, రాజభవనాల వేదికగా ఈ ఏడాది నవంబర్ అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు కేతన్. కానీ అనూహ్యంగా అనంత లోకాలకు చేరడం విషాదం.
Also read
- హారతి సమయంలో గంట మోగించని ఏకైక ప్రసిద్ధ దేవాలయం ఇదే.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న దివ్య రహస్యం ఇదే!
- Video: ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఐస్‌క్రీమ్ అందుకోబోయాడు.. క్షణాల్లోనే ఎవ్వరూ ఊహించని సీన్.. వీడియో చూడండి..
- Andhra: తరచూ అర్థరాత్రి వేళల్లో పోతున్న కరెంట్.. ఏంటా అని ఆరాతీస్తే మైండ్ బ్లాంక్ అయ్యే నిజం..
- పక్కా స్కెచ్.. ఏటీఎం డబ్బుతో పరారైంది తండ్రీకొడుకులే





