విశాఖపట్నం: ముసోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మరణంపై ఇప్పటికే భర్త శ్రీచరణ్ప హత్య కేసు నమోదైన వేళ.. ఇప్పుడు రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడినట్లు చెబుతున్న ఓ ఆడియో క్లిప్ బయటకు రావడం సంచలనంగా మారింది. అందులో భర్త ప్రవర్తనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్లోని ముసోరీ హిల్ స్టేషన్లో ఉన్న ఓ హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త శ్రీచరణపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో క్లిప్ కేసులో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
ఆడియోలో రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడుతూ.. “నా మనసు పూర్తిగా విరిగిపోయింది.. 링 మీద అనుమానం పెంచుకుంటూ, నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు. నేను ఏదైనా తప్పు చేస్తే నేరుగా అడగమని మా అత్తయ్యతో కూడా చెప్పాను. నేను ఇక నా భర్తతో మాట్లాడదలుచుకోలేదు. ఏమైనా ఉంటే మా అమ్మవాళ్లతో మాట్లాడమని ఆమెతో అన్నాను. ఇన్నాళ్లు చాలా ఓపిక పట్టాను.. కానీ అన్ని హద్దులు దాటిపోయాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు వినిపిస్తోంది.
తల్లి సంచలన ఆరోపణలు
రాధా గాయత్రి తల్లి సత్యవతి సంచలన ఆరోపణలు చేశారు. తన కుమార్తె మరణానికి భర్త శ్రీచరణ్ని కారణమని ఆమె మరోసారి ఆరోపించారు. పెళ్లైనప్పటి నుంచి రాధా గాయత్రిపై తీవ్ర అనుమానం పెంచుకున్న శ్రీచరణ్.. ఆమె బ్యాగులో జీపీఎస్ ట్రాకర్ పెట్టి ఎక్కడికి వెళ్తుందో గమనించేవాడని తెలిపారు. ఆఫీసు వెళ్లినప్పటికీ తరచూ వీడియో కాల్స్ చేస్తూ నిఘా పెట్టేవాడన్నారు. “బెడ్పై ఎవరు పడుకున్నారో చూపించు” అంటూ వీడియో కాల్స్ చేసి వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, అయినప్పటికీ ఆమె మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కలిసి మద్యం సేవించినట్లు అసత్య కథనాలు సృష్టించి, పోలీసులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా భార్యాభర్తలు సన్నిహితంగా ఉన్న వ్యక్తిగత ఫొటోలను అర్ధరాత్రిళ్లు తమకు పంపడం ఏమిటని ప్రశ్నించిన సత్యవతి.. తన కుమార్తెను శ్రీచరణ్ హత్య చేశాడని ఆరోపిస్తూ పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు.
తండ్రి అనుమానాలు
ఇదిలా ఉండగా, తన కుమార్తె మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని రాధా గాయత్రి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లైనప్పటి నుంచి శ్రీచరణ్ మానసిక వేధింపులకు గురిచేసేవాడని, ఆమెపై నిఘా పెట్టేందుకు బ్యాగులో ట్రాకర్ కూడా అమర్చాడని ఆరోపించారు. భర్త వేధింపుల గురించి గాయత్రి గతంలో పలుమార్లు తమకు చెప్పిందని వివరించారు.
అంతేకాకుండా, రాధకు లోబీపీ సమస్య ఉందంటూ ప్రచారం చేస్తున్నారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన రోజున శ్రీచరణ్ రక్త నమూనాలు ఎందుకు సేకరించలేదని ప్రశ్నించిన ఆయన.. హోటల్లో మత్తు పదార్థాలు కలిపిన మద్యం ఇచ్చారా? అనే కోణంలో కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఘటనకు ముందు 48 గంటల కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, హోటల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని కోరిన కుటుంబ సభ్యులు.. కేసును ఫోరెన్సిక్ ఆధారాలతో పూర్తిస్థాయిలో విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తన భార్య మృతికి.. తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీచరణ్, అతని కుటుంబం వాదిస్తోంది.
రాధా గాయత్రి తండ్రి ఫిర్యాదు, తాజాగా బయటకు వచ్చిన ఆడియో క్లిప్ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో అసలు నిజాలు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also read
- రోడ్డు దాటుతుండగా విషాదం..!
- ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య
- అమ్మా.. నా మనసు విరిగిపోయింది!
- భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం
- కోస్తా జిల్లాలపై కన్నేసిన కంత్రీ గ్యాంగ్.. సర్కార్ ఎక్స్ప్రెస్ కేసులో షాకింగ్ ట్విస్ట్!





