SGSTV NEWS online
Andhra PradeshCrime

సాయికృష్ణ ఎక్కడ?.. విజయవాడ స్వర్గపురి పరిసరాల్లో సీసీ ఫుటేజీ పరిశీలన



విజయవాడ: ఏపీలో సంచలనంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో రెండో రోజు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విజయవాడ కృష్ణలంక స్వర్గపురి పరిసరాల్లో సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. స్వర్గపురి సిబ్బంది నుంచి ఏసీపీ దైవప్రసాద్ వివరాలు సేకరించారు. ఇటీవల స్వర్గపురిలో అనాథ శవాలను ఖననం చేశారా? నిబంధనలు పాటించారా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. అదృశ్యం వ్యవహారంపై విచారణ అధికారిగా నియమితులైన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ విజయవాడ చేరుకుని నిన్నే విచారణ ప్రారంభించారు. తొలుత డీజీపీని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనంతరం విజయవాడ సీపీ రాజశేఖరబాబును కలిసి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత కృష్ణలంక స్టేషన్కు చేరుకుని సిబ్బందిని ప్రశ్నించారు. కృష్ణలంక స్టేషన్ లోపల, బయట ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలు నమోదైన హార్డిస్క్, డీవీఆర్, ఎన్వీఆర్ పరికరాలను ఫోరెన్సిక్, సైబర్ విశ్లేషణ బృందం సీజ్ చేసింది. అనంతరం ఈ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు.

మార్కాపురం నుంచి ఎప్పుడు తీసుకొచ్చారు?

కృష్ణలంక స్టేషన్లో దర్యాప్తు బృందం.. ఎనిమిది మందిని విచారించింది. టాస్క్్ఫర్స్ ఏడీసీపీ లతాకుమారితో పాటు పలువురు టాస్క్ఫోర్స్, కృష్ణలంక స్టేషన్ సిబ్బందిని విచారించి వాంగ్మూలాలు తీసుకున్నారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను ఎప్పుడు తీసుకొచ్చారు, ఇందుకు ఎవరిని పంపించారు, విజయవాడ తీసుకొచ్చాక ఎవరికి అప్పగించారని ప్రశ్నించి సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. పెండింగ్లో ఉన్న ఎన్బీడబ్ల్యూలను అమలు చేసేందుకే సిబ్బందిని పంపించినట్లు ఏడీసీపీ వివరించారని సమాచారం. సాయికృష్ణను తీసుకొచ్చిన నలుగురిని ప్రశ్నించి, వారి స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారు.

మీ వాణ్ని చంపేస్తా అన్నారు: సాయికృష్ణ తల్లి

‘మీ వాడిని చంపేస్తా.. వాడి ఫొటోకు దండ రెడీ చేసుకో. బయటకు పో’ అని సీఐ నాగరాజు తనను బెదిరించి, తిట్టారని గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘నా కుమారుడు సాయికృష్ణ.. హత్యకేసులో అరెస్టయ్యి కొన్నాళ్లు జైలులో ఉండి, బెయిల్పై విడుదలయ్యాడు. పోలీసులకు భయపడి.. ఇంటికి రాకుండా మార్కాపురంలో తలదాచుకున్నాడు. కృష్ణలంక, మాచవరం స్టేషన్లలో నమోదైన కేసుల్లో కోర్టుకు హాజరుకానందున నాన్-బెయిలబుల్ వారంట్లు పెండింగ్లో ఉన్నాయి. వీటిని అమలుచేసేందుకు పోలీసులు.. మే మొదటి వారంలో మార్కాపురం నుంచి నా కుమారుడిని తీసుకొచ్చారు. ఆ విషయం తెలుసుకుని.. నేను కృష్ణలంక స్టేషన్కు వెళ్లా. నన్ను చూసి సీఐ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి.. స్టేషన్లోని పై అంతస్తు నుంచి నా కుమారుడి కేకలు వినిపించి వెళ్లి చూస్తే లాకప్ లో కనిపించాడు. ఒక్కసారి చూసేందుకు పంపించాలని సీఐని ప్రాధేయపడినా వినిపించుకోలేదు’ అని సీపీకి విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు.

చిత్రహింసలు పెట్టి చంపేశాడు

న్యాయవాది అయిన తన చెల్లెలు కనకదుర్గ వద్దకు వెళ్లి విషయం చెప్పానని, ఆమె లాయర్లతో కలిసి వెళ్లి సీఐని అడిగినా స్పందించలేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘దీంతో చేసేది లేక హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాం. సీఐ నాగరాజు.. సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేశారు. ఆ దెబ్బలు తాళలేక నా కుమారుడు చనిపోయాడు. విషయం బయటకొస్తే ఇబ్బంది అవుతుందని, శవాన్ని తగలబెట్టి బూడిద చేశారు. చట్టం నుంచి తప్పించుకునేందుకు సాక్ష్యాలు లేకుండా చేసేందుకే బూడిద కూడా మిగల్చలేదు. సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని విజయలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also read

Related posts