తిరుపతి జిల్లాలో జరిగిన ఓ చోరీ కేసులో దొంగలు చేసిన చిన్న పొరపాటు చివరకు వారినే పోలీసులకు చిక్కేలా చేసింది. రెండు నెలల క్రితం జరిగిన ఈ దొంగతనం కేసును పోలీసులు ఛేదించడంలో దొంగ వదిలి వెళ్లిన చెప్పులే కీలక ఆధారంగా మారాయి. దీంతో దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు, చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
సూళ్లూరుపేట మండలం మన్నెముట్టూరు గ్రామంలో నివాసం ఉంటున్న ఓ చర్చి ఫాదర్ ఇంట్లో రెండు నెలల క్రితం భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి ఫాదర్ ఇంటికి తాళం వేసుకుని బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన ఇద్దరు యువకులు తాళాలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో దాచిన రూ.2 లక్షల నగదు, సుమారు రూ.7 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు.
అయితే దొంగతనం చేసే సమయంలో నిందితుల్లో ఒకరు తన చెప్పులను ఇంటి బయట వదిలి లోపలికి వెళ్లాడు. దొంగతనం పూర్తయ్యాక హడావుడిలో వాటిని తీసుకెళ్లడం మరిచిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన యజమాని చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా బయట కనిపించిన చెప్పులు అనుమానాలకు తావిచ్చాయి.
ఆ చెప్పుల ఆధారంగా పోలీసులు సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో గ్రామానికి తరచూ వచ్చి వెళ్లే పాకం మనోజ్, తోప్పాని ఈశ్వర్ అనే ఇద్దరిపై అనుమానం కలిగింది. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చివరకు నేరాన్ని ఒప్పుకున్నారు.
నిందితుల వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, రూ.7 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేవలం ఒక జత చెప్పులే ఈ కేసులో కీలక ఆధారంగా మారి దొంగలను కటకటాల వెనక్కి నెట్టాయి. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు బృందాన్ని నాయుడుపేట డీఎస్పీ చెంచు బాబు అభినందించి రివార్డులు అందజేశారు. దీంతో “దొంగను పట్టించిన చెప్పులు” కథ స్థానికంగా చర్చనీయాంశమైంది.
Also read
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..





