SGSTV NEWS online
Andhra PradeshCrime

మారేడుపల్లి పోలీసుల చాకచక్యంతో భారీ చోరీ ఛేదన



మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నెహ్రూనగర్ కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ దంపతుల ఇంటిని లక్ష్యంగా చేసుకొని, కొన్నాళ్లుగా ఆ ఇంట్లోనే కార్పెంటర్‌గా విధులు నిర్వహిస్తున్న వెలిశాల భరత్ దొంగతనానికి పాల్పడ్డట్లు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. నిందితుడి నుంచి రూ.1.8 కోట్ల విలువైన ఒక కిలో బంగారంతో పాటు రూ.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా వైద్యుల దంపతుల ఇంట్లో కార్పెంటర్‌గా విధులు నిర్వహిస్తున్న భరత్, ఇటీవల తన ఇంటి నిర్మాణం కోసం రూ.40 లక్షల రుణం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటి కోసం తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు దొంగతనానికి పాల్పడాలనే ఉద్దేశంతో, డాక్టర్ దంపతులు ఖమ్మంకు వెళ్లిన సమయంలో చోరీకి పాల్పడ్డాడు. నకిలీ తాళాలతో ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలతో పాటు నగదుతో పరారయ్యాడు. వైద్య దంపతులు ఇంటికి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.

మారేడుపల్లి పీఎస్ పరిధిలో ఈ నెల 22వ తేదీన ఓ ఫిర్యాదు వచ్చింది. నెహ్రూనగర్ కాలనీలోని సాయి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న మోహన్ దంపతులు నర్సింగ్ హోమ్‌లో వైద్యులుగా పని చేస్తున్నారు. వారు 20వ తేదీన ఖమ్మం వెళ్లి తిరిగి 22న ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా గుర్తించారు. మొదట రూ.15 లక్షల నగదు, 70 తులాల బంగారం పోయినట్టు ఫిర్యాదు ఇచ్చారు. అనంతరం వాళ్లు నిర్ధారించుకొని, మొత్తం కిలో 180 గ్రాముల బంగారం పోయినట్టుగా గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. వెలిశాల భరత్‌కు వైద్య దంపతులకు మధ్య 12 ఏళ్ల పరిచయం ఉంది. దంపతుల బంధువులకు, స్నేహితులకు, పిల్లలకు అందరికీ కార్పెంటర్ పనికి ఇతన్నే రెఫర్ చేస్తున్నట్లు దంపతులు తెలిపారు. ఈ రకంగా ఆ ఇంట్లో చొరవ ఎక్కువగా ఉండేది. ఇటీవల వైద్యులకు ఆస్తి ఎక్కువ ఉంటుందని కార్పెంటర్ తెలుసుకున్నాడు.

భరత్ తన ఇంటి నిర్మాణం కోసం దాదాపు రూ.40 లక్షలు లోన్ తీసుకున్నట్లు గుర్తించడం జరిగింది. అయితే దంపతుల ఆస్తి విలువ తెలుసుకున్న భరత్, ఇంట్లో చోరీ చేస్తే తన ఇంటి నిర్మాణం ఎలాంటి అప్పు లేకుండా పూర్తవుతుందనే ఉద్దేశంతో సరైన సమయం చూసుకుని దొంగతనానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పెద్ద అంబర్‌పేట్ వద్ద పట్టుకున్నారు. దర్యాప్తులో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆధారాల ప్రకారం ఈ దంపతుల వద్దకు తరచుగా పనికి వస్తుండే కార్పెంటర్ వెలిశాల భరత్ ఈ నేరానికి పాల్పడ్డట్టు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత అతన్ని ట్రేస్ చేస్తూ వెళ్లినప్పుడు దొంగతనం చేసిన వస్తువులన్నీ కూడా తన తల్లిదండ్రుల ఇంట్లో దాచి పెట్టినట్లు గుర్తించాం. అక్కడ రూ. 15 లక్షల నగదు, కేజీ 180 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. చోరీ జరిగిన అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగతనం ఛేదించేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలని డీసీపీ శ్రీధర్ ప్రజలకు తెలిపారు. విలువైన వస్తువులను ఇంట్లో కాకుండా బ్యాంకులో భద్రపరచుకోవాలని సూచించారు.

Also read

Related posts