సోషల్ మీడియా పరిచయాలు పెను ప్రమాదాలకు దారితీస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆన్లైన్లో పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మి వెళ్లి మోసపోతున్న ఉదంతాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఇలాంటి దారుణ ఘటనే వెలుగు చూసింది. ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ కోసం రీల్స్ చేయాలంటూ ఓ యువతిని రప్పించి, మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ కోసం రీల్స్ చేద్దామని పిలిపించి.. యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన మంగళగిరిలో వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన ఓ యువతికి మంగళగిరికి చెందిన జిలానీ అలియాస్ సిద్దిక్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. తాను సింగర్, యాంకర్‌గా పనిచేస్తున్నట్లు ఆమె జిలానీకి తెలిపింది. దీనిపై స్పందించిన జిలానీ.. తనకు విజయవాడలో పెట్ షాప్ ఉందని చెప్పాడు.
పరిచయం జరిగిన మూడు నెలల తర్వాత, తన పెట్ షాప్‌కు సంబంధించి ప్రమోషనల్ రీల్స్ చేయాలంటూ ఆమెకు ఆఫర్ ఇచ్చాడు జిలానీ. ఇందుకు బాధితురాలు కూడా అంగీకరించింది. అంతేకాదు రీల్స్ చేసినందుకు గాను రూ. 30,000 పారితోషికం కూడా ఇస్తానని నమ్మబలికిన జిలానీ. ఇక పథకం ప్రకారం గత నెల 20వ తేదీన ఆమెను మంగళగిరి రావాల్సిందిగా కోరాడు. అతని మాటలు పూర్తిగా నమ్మిన ఆమె చెప్పినట్టుగానే మంగళగిరికి చేరుకుంది.
మంగళగిరికి చేరుకున్న అనంతరం, స్థానిక లాడ్జిలోని రూమ్ నంబర్ 303లో ఉండాలని జిలానీ ఆమెకు సూచించాడు. ఆమె ఆ గదిలో వేచి చూస్తుండగా అక్కడికి వచ్చిన జిలానీ, తాగడానికి మంచినీరు అందించాడు. ఆ నీళ్లు తాగిన వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. ఆమె అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో జిలానీ ఆమెను వివస్త్రను చేసి నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీశాడు.
సుమారు మూడు గంటల తర్వాత బాధితురాలు స్పృహలోకి రాగా, ఆ న్యూడ్ ఫొటోలు, వీడియోలు చూపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె ఫోన్ ద్వారా రూ.16,000 ఫోన్‌పే చేయించుకున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ తీవ్రంగా బెదిరించి, గదికి బయటి నుంచి గడియపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.
మరుసటి రోజు అతికష్టం మీద లాడ్జి నుంచి బయటపడిన బాధితురాలు స్వగ్రామమైన కడపకు చేరుకుంది. అయితే కడప చేరుకున్న తర్వాత కూడా మూడు రోజుల పాటు నిందితుడి నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. దీంతో మానసిక వేదనకు గురైన బాధితురాలు గత నెల 24వ తేదీన కడప పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఘటన మంగళగిరి పరిధిలో జరగడంతో కడప పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తదుపరి చర్యల నిమిత్తం కేసును మంగళగిరి పట్టణ పోలీసులకు బదిలీ చేశారు.
కేసు నమోదు చేసుకున్న మంగళగిరి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడు జిలానీని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని పోలీసులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. జిలానీకి, బాధితురాలికి అంతకుముందే ఏవైనా పరిచయాలు లేదా సాన్నిహిత్యం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఘటనాస్థలమైన లాడ్జి నిర్వాహకులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. లాడ్జిలోని సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను స్వాధీనం చేసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుడి అధికారిక అరెస్టును త్వరలోనే చూపిస్తామని పోలీసులు తెలిపారు.
Also read
- Tulsi Vastu: డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి!
- Sanatana Dharma: దేవుడి గదిలోకి వెళ్లే ముందు స్నానం తప్పనిసరా? మన సంప్రదాయం ఏం చెబుతుందంటే..
- గురువారం అరటి చెట్టును ఎందుకు పూజించాలి? దీని వెనుకున్న రహస్యం తెలుసా?
- నేటి జాతకములు..8 అక్టోబర్, 2026
- Medak: ఫోన్‌పే బాక్స్ రిపేర్ చేస్తానంటూ మోసం.. క్షణాల్లో వేలు మాయం





