కర్నూలు జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా మూడు ప్రాణాలు బలైన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను వదిలి ప్రియుడితో వచ్చిన ఓ మహిళ, ఆమె ఐదు నెలల పసికందు, చివరకు ప్రియుడు కూడా మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన హాలహర్వి మండలం గూళ్యం గ్రామం సమీపంలో చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గూళ్యం గ్రామానికి చెందిన మహేష్‌కు 16 సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని వనేనూరు గ్రామానికి చెందిన శాంతమ్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. అనంతరం మహేష్ మరో మహిళను వివాహం చేసుకుని కర్ణాటకలోని సంగనకల్లు ప్రాంతంలో నివాసం ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని, లారీ డ్రైవర్ మహేష్ ఆచారి భార్య అణుతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటపడటంతో ఆచారి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి.
రెండు రోజుల క్రితం మహేష్, అణు, ఆమె ఐదు నెలల చిన్నారితో కలిసి గూళ్యం గ్రామంలోని గాదిలింగస్వామి ఆలయానికి వచ్చారు. అనంతరం అక్కడి నుంచి ఆటోలో ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని తుంగభద్ర దిగువ కాలువ సమీపంలోని పొలాలకు వెళ్లారు. అక్కడ ముగ్గురూ పురుగుల మందు తాగినట్లు గుర్తించారు. ఈ ఘటనలో అణు, ఆమె ఐదు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర అస్వస్థతకు గురైన మహేష్‌ను బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం అతడు కూడా మృతి చెందాడు.
ఈ ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ముఖ్యంగా ఐదు నెలల పసికందు కూడా ఈ విషాదానికి బలికావడం స్థానికులను కలచివేసింది. వివాహేతర సంబంధాలు, కుటుంబ విభేదాలు ఎంతటి దారుణ పరిణామాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





