విశాఖపట్నం: ఓ మాజీ సైనికోద్యోగి తన ప్రాంత సమస్యపై పెట్టిన ఫేస్బుక్ పోస్టు అతడిని సైబర్ నేరగాళ్ల బుట్టలో పడేలా చేసింది. విశాఖలోని పాత రేసపువానిపాలెంకు చెందిన మాజీ సైనికోద్యోగి బి. శ్రీనివాసరెడ్డి సీతంపేట, రాజేంద్రనగర్ లోని రూ.20 కోట్ల విలువైన 1,843 గజాల జీవీఎంసీ ఖాళీ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని కోరుతూ ఈ నెల 3న మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, టీడీపీ అధికారిక ఫేస్బుక్ పేజీలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. దీన్ని చూసిన సైబర్ నేరగాళ్లు.. శ్రీనివాసరెడ్డి సమస్యను ఆసరాగా చేసుకుని పక్కా ప్లాన్ వేశారు.
ఇందులో భాగంగా ఈ నెల 7న శ్రీనివాసరెడ్డికి ఓ వాట్సప్ కాల్ వచ్చింది. దానికి మాజీ మంత్రి దేవినేని ఉమా ఫొటో డీపీగా ఉంది. ఫోన్ చేసిన అగంతకుడు తాను దేవినేని ఉమను మాట్లాడుతున్నానని, పార్కు స్థలం సమస్యను రష్యా పర్యటనలో ఉన్న లోకేశ్ తన దృష్టికి తెచ్చారని, దాన్ని పరిష్కరించే బాధ్యత తనకు అప్పగించారని చెప్పాడు. బాధితుడికి అనుమానం రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజులతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తున్నట్లు నటించాడు.
అంతేకాకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ తదితరులతో తాను వాట్సాప్లో చాట్ చేసినట్లుగా ఫేక్ స్క్రీన్ షాట్లని సృష్టించి బాధితుడికి పంపాడు. నేరుగా జీవీఎంసీ కమిషనర్తో మాట్లాడి పార్కు సమస్యతో పాటు, బాధితుడికి ఉన్న ఖాళీ స్థలాల పన్ను (వీఎల్డీ) సమస్యను కూడా పరిష్కరిస్తానని మభ్యపెట్టాడు. అనుకున్న పనులు పూర్తి కావాలంటే జీవీఎంసీ కమిషనరు ముందుగా కొంత ‘ఫార్మాలిటీ అమౌంట్’ ఇవ్వాలని షరతు పెట్టాడు.
దీన్ని నమ్మిన బాధితుడు 7న సైబర్ నేరగాడు పంపిన ‘రాథోడ్ సంతోష్’ అనే పేరుతో ఉన్న యూపీఐ క్యూ ఆర్ కోడ్కు ఫోన్ పే ద్వారా రూ.80 వేలు పంపించాడు. ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం వరకు ఆ వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, వాట్సాప్ డీపీ కూడా తొలగించడంతో తాను మోసపోయానని బాధితుడు గ్రహించాడు. వెంటనే విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
Also read
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్‌కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..
- ATM: ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం.. బెడిసికొట్టిన ప్లాన్..!
- దొంగను పట్టించిన చెప్పులు.. రెండు నెలల తర్వాత దొరికిన అసలైన క్లూ!





