ఆలస్యంగా ఇంటికొస్తోందనే అనుమానంతో…
రాజేంద్రనగర్: ఆలస్యంగా ఇంటికొస్తోందనే కారణంతో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త… ఆమెపై దాడిచేసి హతమార్చిన ఉదంతమిది. ‘నాన్నా.. అమ్మను చంపొద్దంటూ’ కన్నబిడ్డ వేడుకుంటున్నా… ప్రాణభయంతో ఆ ఇల్లాలు పరుగెడుతున్నా లక్ష్యపెట్టకుండా కిరాతకంగా దాడిచేసి ఆమెను అంతమొందించిన కిరాతకుడి కథ ఇది. అత్తాపూర్ పోలీస్టేషన్ పరిధి తేజస్వీనీనగర్‌లో చోటుచేసుకుందీ దారుణం.
అత్తాపూర్ ఎస్సై పార్వతి కథనం ప్రకారం… నాందేడ్‌కు చెందిన కోమలి(31), అవినాష్ దంపతులకు 8, 9 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. 6 నెలల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఈ కుటుంబం.. అత్తాపూర్ తేజస్వీనినగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో పనికి కుదిరింది. కోమలి కాపలాదారుగా ఉంటూ అదే భవనంలోని పలువురి ఇళ్లలో పనిచేస్తోంది. అవినాష్ ఆటోడ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇళ్లలో పనిచేసేందుకు వెళ్లిన కోమలి.. ఆలస్యంగా ఇంటికి వస్తోందనే కారణంతో అవినాష్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. గురువారం రాత్రి మద్యం తాగి వచ్చిన అవినాష్.. ఇదే విషయమై భార్యతో గొడవకు దిగాడు. శుక్రవారం తెల్లవారుజాము వరకు గొడవ కొనసాగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన అవినాష్.. భార్యపై కత్తితో దాడికి దిగాడు.
గమనించిన పెద్ద కుమారుడు.. అమ్మని చంపొద్దంటూ తండ్రిని వేడుకున్నా లక్ష్యపెట్టలేదు. ఈ తరుణంలో అతని బారినుంచి తప్పించుకున్న కోమలి కేకలు పెడుతూ..బయటకు పరుగెత్తగా అవినాష్ వెంటపడ్డాడు. ఒక దశలో చేతిలో ఉన్న కత్తి జారిపోగా.. అక్కడే ఉన్న స్క్రూడ్రైవర్‌తో ఇష్టానుసారం పొడవడంతోపాటు రాడ్డుతో దాడిచేశాడు. బాధితురాలి ఆర్తనాదాలు విని అపార్ట్మెంట్ వాసులు బయటకు రావడంతో అవినాష్ అక్కణ్నుంచి పరారయ్యాడు. స్థానికులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కాసేపటికే ఆమె మృతి చెందింది.
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also read
- నెయ్యి గోదాములో భారీ అగ్ని ప్రమాదం
- సహజీవనం తీసింది ప్రాణం.. అనాథలైన నలుగురు పిల్లలు
- కుమారుడి కళ్లెదుటే కిరాతకం.. భార్యను హత్య చేసిన భర్త
- ఇన్వర్టర్ నుంచి విద్యుత్తు సరఫరా..స్తంభంపైనే ప్రాణాలొదిలిన కార్మికుడు
- మృగశిర కార్తె అయితే.. చేపలు కొనుక్కోవాలి.. లూటీ చేయకూడదు.. చెరువు మీద పడి నిమిషాల్లోనే..





