SGSTV NEWS online
Astro TipsHindu Temple HistorySpiritual

ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించే తిరువారూర్ ఆలయం- దర్శిస్తే దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట!


పరమేశ్వరుడు అగ్నీశ్వరుడిగా, ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించే శనీశ్వరుడు ఒకేచోట కొలువైన పుణ్యక్షేత్రం- తమిళనాడులోని తిరువారూర్ పొంగు శనీశ్వర ఆలయం

పరమేశ్వరుడు అగ్నీశ్వరుడిగా, ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించే శనీశ్వరుడు ఒకేచోట కొలువైన పుణ్యక్షేత్రం తిరువారూర్ శనీశ్వర క్షేత్రం. ఈ ఆలయంలో వెలసిన శని భగవానుని దర్శించి పూజిస్తే ఏలినాటి శని ప్రభావం తగ్గడం మాత్రమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయంట!

జీవితంలో మూడు సార్లు తప్పని దశ
ఏలినాటి శని అనే దశ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి 30 ఏళ్లకు ఒకసారి వచ్చే క్లిష్టమైన దశ. మూడు దశలుగా కొనసాగే ఈ ఏలినాటి దశలో మొదటి దశను ‘వ్యయ’ దశ తమిళంలో ‘మంగు’ దశ అని అంటారు రెండో దశను ‘జన్మ,’ తమిళంలో ‘పొంగు’ అంటారు. ఇక ఆఖరిది చివరిదైన దశను ‘ద్వితీయ’, తమిళంలో ‘మరణ’ శనిగా పిలుస్తారు. ఏడున్నర సంవత్సరాల పాటు కొనసాగే ఈ ఏలినాటి శని దశలో మహామహులైన శివుడు, ధర్మరాజు, నల చక్రవర్తుల వంటివారే ఎన్నో అవస్థలు పడ్డారు. ఇక సామాన్యుల సంగతి సరేసరి! ఈ దశలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికంగా ఉంటాయి. అయితే తమిళనాట వెలసిన పొంగు శనీశ్వర ఆలయంలో శనీశ్వరుని దర్శించి పూజిస్తే కష్టనష్టాలు తొలగి సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ ఆలయ విశేషాలు చూద్దాం.

పొంగు శనీశ్వర ఆలయం ఎక్కడుంది?
తమిళనాడు తిరువారూర్ జిల్లాలోని తిరుక్కొళ్లికాడులో వెలసిన పొంగు శనీశ్వర దేవాలయం మహిమాన్వితమైన శని దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అవడానికి ఇది శని దేవాలయమైనప్పటికీ మూలమూర్తిగా పరమశివుడు ఇక్కడ పూజలందుకోవడం విశేషం. వందల సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అగ్నీశ్వరర్ ఆలయంగా కూడా పిలుస్తారని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

ఆలయ స్థల పురాణం
పూర్వం దక్ష ప్రజాపతి నిర్వహించిన నిరీశ్వర యాగంలో అగ్నిదేవుడు పాల్గొనడం ఈశ్వరునికి ఆగ్రహం కలిగించింది. అలాగే పాండవులు నిర్మించుకున్న లక్క గృహాన్ని అగ్నిదేవుడు ఆహుతి చేయడం కూడా పరమ శివుని ఆగ్రహానికి కారణమైంది. ఈ కారణాల చేత పరమేశ్వరుడు అగ్నిదేవుని తీవ్రంగా శపించాడట! అప్పుడు అగ్నిదేవుడు తన శక్తులన్నీ కోల్పోయి, పశ్చాత్తాపంతో ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయసాగాడు. అప్పుడు శివుడు అగ్నిదేవునికి అగ్ని రూపంలో ప్రత్యక్షమై కరుణించాడని, ఆనాటి నుంచి శివుడు అగ్నీశ్వరర్ గా ఇక్కడే కొలువై ఉన్నాడని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

శని భగవానుడు శనీశ్వరుడిగా ఇలా మారాడు!
మరో కథనం ప్రకారం ఏలినాటి శని కారణంగా పడే బాధలతో భక్తులు తనను దూషిస్తున్నారని ఆవేదన చెందిన శని తనకు పరిష్కారం చూపమని వశిష్ఠ మహర్షిని ప్రార్ధించాడంట! అప్పుడు వశిష్ఠ మహర్షి శని దేవునితో ఈశ్వరుని పూజించమని సూచించాడంట! మహర్షి సూచన మేరకు శని దేవుడు ఇక్కడకు వచ్చి శివుని గురించి తపస్సు చేయగా, శివుడు మెచ్చి ప్రత్యక్షమై, ఈ ప్రదేశంలో శనిని దర్శించి, పూజించే వారికి సకల శుభాలు చేకూరుతాయని వరమిచ్చాడంట! అంతేకాకుండా తన పేరులోని ఈశ్వరుని శని భగవానునికి జోడించడంతో అప్పటి నుంచి శని భగవానుడు శనీశ్వరుడిగా పూజలందుకో సాగాడు. తదనంతరం శివుడు కూడా అక్కడే స్వయంభువుగా కొలువై తనతోపాటు శని భగవానునికి ఈ క్షేత్రంలో స్థానం కల్పించాడన్నది స్థల పురాణానికి సంబంధించిన ప్రచారంలో ఉన్న మరో కథనం.

ఆలయ చరిత్ర
తిరువారూర్ శనీశ్వర దేవాలయాన్ని చోళ రాజులు నిర్మించినట్లుగా ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. పూర్వం నల మహారాజు ఈ ఆలయాన్ని దర్శించి శని, ఈశ్వరులను పూజించడం వలన శని బాధల నుంచి ఉపశమనం పొందినట్లుగా ఆలయ చరిత్ర ద్వారా స్పష్టమవుతోంది.

ఆలయ విశేషాలు
సాధారణంగా శివాలయంలోని శివలింగాలన్నీ నల్లని రంగులో ఉండటం తెలిసిందే! కానీ తిరువారూర్ పొంగు శనీశ్వర దేవాలయంలో గర్భాలయంలో వెలసిన ఈశ్వరుడు అరుణ వర్ణంలో ప్రకాశిస్తూ ఉండడం విశేషం. అలాగే ఇక్కడ స్వామితో పాటు వెలసిన అమ్మవారు మృదుపద నాయకిగా పూజలందుకుంటోంది.

సంపదలనిచ్చే శని
ఇక్కడ శని తన వాహనమైన కాకితో కలిసి ఒక చేత నాగలి ధరించి, మరో చేత అభయ హస్తంతో దర్శనమిస్తాడు. ఆలయంలో మహాలక్ష్మి సన్నిధికి సమీపంలో ఉన్న కుబేర స్థలంలో కొలువైన ఈ శని భగవానుని దర్శిస్తే శని దోషాలు తొలగడం మాత్రమే కాకుండా సంపదలతో పాటు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని విశ్వాసం.

ధనుర్ధారిగా సుబ్రహ్మణ్యుడు
ఈ క్షేత్రంలో ఎక్కడ లేని విధంగా సుబ్రహ్మణ్య స్వామి ధనుర్బాణంతో దర్శనమివ్వడం విశేషం.

ఇతర ఉపాలయాలు
ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలు, కాలభైరవ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఇతర ఆలయాల్లో నవగ్రహాలు తలో దిక్కుగా ఉంటే ఇక్కడ మాత్రం నవగ్రహాలు ఎదురెదురుగా ఉండడం విశేషం. అలాగే ఆలయ ప్రాంగణంలో శివునికి బిల్వ దళాలతో పూజించినట్లుగా శనిని పూజించడానికి జమ్మి చెట్టు వృక్షం ఉంటుంది.

పూజోత్సవాలు
ప్రతి రోజు ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయి. ప్రతి సోమవారం, శనివారం విశేష పూజలు జరుగుతాయి. తమిళనాడులోని పుణ్యక్షేత్రాలు, తీర్ధయాత్రలు చేసే వారు ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకుంటారు. అందుకే ఈ ఆలయం ప్రతిరోజూ భక్తులతో కళకళలాడుతుంది. ఇక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. అలాగే శని త్రయోదశి, శని జయంతి కూడా ఇక్కడ ముఖ్యమైన పండుగలు. ఈ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగే శని జయంతి ఉత్సవాలు చూడడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేయడం విశేషం.

ఎలా చేరుకోవాలి?
తమిళనాడు తిరువరూర్ రైల్వే స్టేషన్ నుంచి అరగంట ప్రయాణం చేసి తిరుక్కొళ్లికాడు పొంగు శనీశ్వర దేవాలయానికి చేరుకోవచ్చు. తిరుచిరాపల్లి విమానాశ్రయం నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఇటు శని దోషాలు తొలగించడంతో పాటు అటు అష్టైశ్వర్యాలు ప్రసాదించే తిరువారూర్ పొంగు శనీశ్వర దేవాలయాన్ని మనం కూడా దర్శిద్దాం. తరిద్దాం. ఓం నమః శివాయ! ఓం శనైశ్చరాయ నమః!

Also read

Related posts