SGSTV NEWS online
Hindu Temple History

శ్రీ చక్రం ఆకారంలో “దేవీ ఆలయం” – మహిళలే “పూజారులు”!


-త్రిపురసుందరి కోరి మరీ కట్టించుకున్న మహిమాన్విత క్షేత్రం – రాజరాజేశ్వరి దేవితో పాటు 108 దేవతల విగ్రహాల ప్రతిష్ఠ!

Devipuram Sahasrakshi Rajarajeshwari Temple: ఏదైనా దేవాలయానికి వెళ్లినా అక్కడ పురుషులే పూజారులుగా ఉంటారు. వాళ్లే అన్ని రకాల పూజలు నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే గుడిలో మాత్రం మహిళలు అర్చకులుగా మారి పూజాదికాలు నిర్వహిస్తారు. వీరితో పాటు రైతులూ ఉంటారు. పైగా ఈ దేవాలయాన్ని శ్రీ చక్రం ఆకారంలో నిర్మించడం విశేషం. అంతేకాకుండా ఈ ఆలయం వెనుక మరికొన్ని ఆసక్తికరమైన అంశాలూ ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

పైన చెప్పిన వివరాలు అన్నీ దేవీపురం క్షేత్రం ప్రత్యేకతలు. త్రిపురసుందరి కోరి మరీ కట్టించుకున్న మహిమాన్వితమైన క్షేత్రం. దాదాపు 10 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో ఉంది. ఈ ఆలయాన్ని మహామేరు శ్రీ చక్రం ఆకారంలో నిర్మించారు. అంతేకాకుండా 108 అడుగుల ఎత్తు, 108 అడుగుల వెడల్పు, 9 ఆవరణలతో మూడు అంతస్తుల్లో ఈ గుడి ఉంటుంది. గర్భాలయంలో కొలువైన మూలమూర్తి.. సహస్రాక్షి రాజరాజేశ్వరిగా పూజలు అందుకుంటుంది. రాజరాజేశ్వరి దేవితో పాటు 108 దేవతల విగ్రహాలను ఉపాలయాల్లో ప్రతిష్ఠించారు. కులమతాలకు అతీతంగా ఎవరైనా దర్శించుకునేలా నిర్మించిన ఈ ఆలయం నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది.

ఎవరు నిర్మించారు: ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో అణుశాస్త్రవేత్తగా పని చేసేవారు డా. ప్రహ్లాద శాస్త్రి. అమ్మవారి భక్తుడు కావడంతో నిత్యం ధ్యానం చేసేవారు. అయితే ఇలానే ఓసారి ధ్యానంలో ఉన్నప్పుడు తన కోసం ఓ గుడి నిర్మించమని త్రిపురసుందరీదేవి ఆయన్ని ఆదేశించిందట. దాంతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి.. సొంతూరు వైజాగ్కు చేరుకుని అమ్మవారి ఉపాసకుడిగా, అమృతానంద స్వామిగా మారారు. అలా మొదటగా 1985లో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారట. అయితే అది పూర్తి కావడానికి దాదాపు 10 సంవత్సరాల సమయం పట్టిందంట. ఆలయ నిర్మాణానికి తగిన చోటును వెతుకుతూ ఇక్కడ తవ్విన సమయంలో అగ్నిలో కాల్చిన గుర్తులున్న పంచలోహ శ్రీచక్ర మహామేరువు కనిపించిందట. దీని గతచరిత్ర పరిశోధిస్తే.. ఈ ప్రాంతంలో దాదాపు 250 సంవత్సరాల క్రితం గొప్ప యాగం జరిగినట్లుగా, అది పూర్తికాగానే ఆ శ్రీచక్ర మహామేరువును భూమిలో నిక్షిప్తం చేసినట్లుగా తెలిసిందట. దీంతో ఆ శ్రీచక్రాన్ని ఆధారంగా చేసుకునే ఇక్కడ ఆలయాన్ని రూపొందించారని ప్రశస్తి.

కులమతాలకు అతీతంగా: ఇక్కడ పూజారులు ఎవరూ ఉండరు. స్థానిక రైతులు, మహిళలు మాత్రమే శ్రీ విద్యా పూజా విధానాన్ని నేర్చుకుని ఇక్కడ అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. రైతులకు తొలి ప్రాధాన్యం ఇచ్చే ఈ ఆలయంలో ఎవరైనా పూజారులుగా పనిచేయొచ్చని అంటారు ఆలయ నిర్వాహకులు. ఇంకా.. శివాలయంలో ఒకేసారి 1000 మంది కూర్చుని పూజలు చేసుకునేలా శివలింగాలూ ఉంటాయి. చండీహోమం, నవావరణ అర్చన, రుద్రాభిషేకంతో పాటు నిత్యం విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారిని పూజించి, ఏదయినా మొక్కుకుంటే త్వరగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇక మహాశివరాత్రి, కార్తికమాసం, దేవీనవరాత్రుల సమయంలో జరిగే విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచీ భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు.

అమ్మాయిల కోసం గురుకుల పాఠశాల: కేవలం ఆలయం మాత్రమే కాకుండా శ్రీ విద్యా ట్రస్టు నేతృత్వంలో అమ్మాయిల కోసం “అమృతకన్య” అనే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. ఔత్సాహికులకు చదువుతోపాటు అమ్మవారి సాధనపట్ల కూడా అవగాహన కల్పిస్తారు. అదే విధంగా మహిళలకు పలు అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు అందించి, ఆదాయబాట పట్టేలానూ ప్రోత్సహిస్తున్నారు.

ఎలా చేరుకోవాలి: ఈ ఆలయం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని దేవీపురంలో ఉంది. కాబట్టి రైలు ద్వారా రావాలనుకునే భక్తులు అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడి నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా గుడి వద్దకు చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ నుంచి దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.

Also read

Related posts