ట్రిపుల్ ఐటీలో కలకలం రేపిన దళిత విద్యార్థి ఆత్మహత్య
చిక్కువీడని ప్రశ్నలెన్నో..
తల్లిదండ్రులు వస్తే కానీ కారణం చెప్పలేమంటున్న పోలీసులు
శ్రీకాకుళం /ఎచ్చెర్ల : జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో బుధవారం ఉదయం ప్రత్తిపాటి సృజన్ (21) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యార్థి మృతిపై స్థానికంగా విభిన్న కథనాలు వినిపిస్తుండగా పోలీసులు మాత్రం తల్లిదండ్రులు వస్తే కానీ ఏమీ చెప్పలేమని, ప్రస్తుతం విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లాకు చెందిన సృజన్ ఎచ్చెర్ల ఎస్ఎంపురం సమీపంలోని ట్రిపుల్ ఐటీ ఇంజినీర్ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులందరితో సరదాగా ఉండే సృజన్ బుధవారం ఉదయం 11 గంటలకు కళాశాలలోనే నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంది. ఈలోగా మొదటి అంతస్తులో ఉన్న ఈసీ డిపార్ట్మెంట్ విద్యార్థుల్లో ఒకరికి ఫోన్ చేసి రూంలో ఎవరైనా ఉన్నారా అని సృజన్ అడిగాడు. ఎవరూ లేరని చెప్పడంతో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఎగ్జామ్ నుంచి వచ్చాక గది తలుపులు మూసి ఉండటంతో వెంటిలేటర్ నుంచి గమనించిన విద్యార్థులు ఏదో జరిగిందని అనుకుంటుండగా మెస్ ఆఫీసర్ రావడం.. అంతా చూసేసరికి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించడంతో అవాక్కయ్యారు. వెంటనే కళాశాల యాజమాన్యం గుంటూరులో ఉన్న సృజన్ తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు హుటాహుటిన బయల్దేరారు. ఎస్ఐ వి. సందీప్ తమ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు.
విభిన్న కథనాలెన్నో..
కాగా సృజన్ ఆత్మహత్యపై అక్కడ విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. బ్యాక్ లాగ్స్ 11 సబ్జెక్టులు ఉండటంతో ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడి వుంటాడని కొందరు అనుకుంటుండగా.. ఓ అమ్మాయితో స్నేహంగా ఉండటం.. ఆమె అన్నదమ్ములు అదే కళాశాలలో చదువుతుండటం.. వారు ఒకట్రెండు సార్లు సృజనను హెచ్చరించడం చేశారని తెలిసింది. అంతేకాక మంగళవారం రాత్రి పది మందివరకు కళాశాలలో ప్రవేశించారని, వారి వెనుక ఆ విద్యార్థులున్నారని, సృజన్‌ను కొట్టారని సమాచారం. ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తల్లిదండ్రులు వచ్చేంతవరకు ఏమీ చెప్పలేమన్నారు.
ఐదుగురితో పోలీస్ పికెట్
మృతిచెందిన విద్యార్థి దళిత సామాజికవర్గానికి చెందడంతో క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నలుగురు కానిస్టేబుళ్లు, ఒక ఎస్ఐతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారి ‘మీడియా తెలిపారు.
Also read
- నేటి జాతకములు.14 నవంబర్, 2025
- సృజన్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి?
- కె జి హచ్ వైద్యం అందక గిరిజన పసికందు మృతి
- ఏడో తరగతి బాలుడిపై లైంగికదాడి
- భార్యపై అనుమానంతో దారుణం చేసిన భర్త





