ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్నా కొద్దీ.. నేరాల తీరు కూడా మారిపోతోంది. ఏ తరహాలో క్రైమ్ చేయాలి?.. చేతులకు మట్టి అంటకుండా ఎలా చూసుకోవాలి.. ఎలా తప్పించుకుని తిరగాలి.. ఒకవేళ దొరికితే అందులోంచి ఎలా బయటపడాలి.. లాంటి విషయాలను కూడా ఆన్లైన్లోనే వెతికేస్తున్నారు. ఈ క్రమంలో.. పొరుగు రాష్ట్రంలో ఓ షాకింగ్ వెలుగు చూసింది.
దండుపాళ్యం బ్యాచ్కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఓ ముఠా కర్ణాటక రాజధాని బెంగళూరులో అఘాయిత్యానికి పాల్పడింది. ఒంటరి మహిళపై సుదీర్ఘకాలం నిఘా ఉంచి.. డబ్బు కోసం పథకం ప్రకారం ఆమెను మట్టుపెట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 20వ తేదీన కురుబరహల్లి ప్రాంతాలో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఓ బైక్ వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలైందామె. దీంతో అక్కడే ఉన్న కొందరు యువకులు ఆమెను హుటాహుటిన ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. రెండ్రోజుల తర్వాత.. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. అయితే..
అది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని.. పైగా ఆమెను ఆస్పత్రిలో చేర్పించే టైంలో ఘోరం జరిగిందని పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఈ యాక్సిడెంట్ చేసినోడే.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించానంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ ఎపిసోడ్లో మరో కొసమెరుపు.
మహాలక్ష్మి లేఅవుట్ పీఎస్ పరిధిలో మహాలక్ష్మి అనే మహిళ ఒంటరిగా ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. తెలిసినవాళ్ల ద్వారా చేతన్ అనే వ్యక్తి ఆమె దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. అయితే ఆమె దగ్గర మరింత డబ్బు, నగలు ఉన్నట్లు భావించాడు. ఈ క్రమంలో.. స్నేహితులు రాకేష్, మంజునాథ్, చిప్స్ ప్రదీప్, యోహాన్ జాన్తో కలిసి ఓ పథకం వేశాడు.
ప్లాన్ ప్రకారం.. రాకేష్ తన బైక్తో నడుచుకుంటూ వెళ్తున్న మహాలక్ష్మిని ఢీ కొట్టాడు. ఆ వెంటనే మిగతా నిందితులు ఆటోతో పాటు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించడానికి ప్రయత్నించినట్లు నటించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే వంకతో ఆమె పర్సులోని ఇంటి తాళం కొట్టేశాడు మంజునాథ్. ఆపై ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి తాళం తెరవబోయాడు. అయితే అది చూసిన ఇంటి యాజమాని అతన్ని నిలదీశాడు. మహాలక్ష్మికి యాక్సిడెంట్ అయ్యిందని.. ఆస్పత్రిలో చేర్పించామని.. ఆస్పత్రివాళ్లు ఆధార్ కార్డు అడుగుతున్నారని చెప్పాడు. దీంతో యాజమాని హుటాహుటిన మంజునాథ్ ఆస్పత్రికి బయల్దేరాడు. ఈలోపు.. మంజునాథ్ మిగతా వాళ్లకు సమాచారం ఇవ్వడంతో తమ పథకం విఫలమైందని భావించి ఆమెను విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు.
అయితే.. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. రెండ్రోజుల తర్వాత మంజునాథ్ ఇంటి తాళం తెరవబోయిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు ఆ ఇంటి ఓనర్. దీంతో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మంజునాథ్ను.. అతనిచ్చిన సమాచారంతో మిగతా వాళ్లనూ అరెస్ట్ చేశారు. మహాలక్ష్మికి బైక్తో ఢీ కొట్టాక.. సరాసరి ట్రాఫిక్ పీఎస్కు వెళ్లిన రాకేష్ “గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని.. తాను ఆస్పత్రిలో చేర్పించానని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి” అని ఫిర్యాదు చేశాడు.
చివరకు పోలీసులు అసలు విషయం తేల్చేయడంతో.. దొంగతనం చేయడానికి ఆమెకు యాక్సిడెంట్ చేశామని, ప్రాణం పోతుందని అనుకోలేదని ఆ యువకులు ఒప్పుకున్నారు. దీంతో హత్య కేసు నమోదు చేసుకుని నిందితుల్ని రిమాండ్ కు తరలించారు.
Also read
- దండుపాళ్యం’కు ఏమాత్రం తీసిపోకుండా..
- వైద్యుడి బలవన్మరణం.. నర్స్ ఆత్మహత్య
- Hyderabad: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దారుణహత్య
- జూబ్లీహిల్స్ మైనర్ల ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వీడి తెలివితేటలు మామూలుగా లేవుగా!
- మొగుడు పెళ్ళాం మధ్య గొడవ.. సర్దిచెప్పడానికి వచ్చిన అత్త.. కాసేపటికే తలుపు వేసి..





