SGSTV NEWS online
CrimeTelangana

మునుకుంట్ల ప్రేమికుల మృతి ఘటనలో ట్విస్ట్..!



నల్లగొండ జిల్లా: కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో 24 గంటల వ్యవధిలో చోటుచేసుకున్న ఇద్దరు యువతీయువకుల మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముందుగా అనుమానాస్పద పరిస్థితుల్లో యువతి మృతి చెందగా, మరుసటి రోజే ఆమెతో ప్రేమలో ఉన్నట్లు చెబుతున్న యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రెండు ఘటనల మధ్య ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



వివరాల ప్రకారం.. మునుకుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న (23) శుక్రవారం అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యులు ఆమెను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

లక్ష్మీ ప్రసన్న సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడిపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా లక్ష్మీ ప్రసన్న, చరణ్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

అయితే, ప్రసన్న మృతి ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలోనే శనివారం ఉదయం చరణ్ గ్రామ శివారులో తాటి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వరుసగా 24 గంటల్లో ఇద్దరు యువతీయువకులు ప్రాణాలు కోల్పోవడంతో మునుకుంట్ల గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

అయితే, లక్ష్మీ ప్రసన్న మృతి, చరణ్ ఆత్మహత్య ఘటనలకు పరస్పర సంబంధం ఉందా? ప్రేమ వ్యవహారమే ఈ విషాదానికి కారణమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

Also read

Related posts