కొత్తపేట, అయినవిల్లి : ఆ యువతి భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నారు.. కష్టపడి ఇంజినీరింగ్ పూర్తిచేసి ప్రతిభావంతురాలిగా నిరూపించుకున్నారు. కలల కొలువు సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించారు. మొక్కు తీర్చుకోవడానికి దైవదర్శనానికి వెళ్తున్న క్రమంలో మృత్యువు ప్రమాదరూపంలో వెంటాడింది. టిప్పర్ చోదకుడి నిర్లక్ష్యంతో ఆమె ప్రాణాలు కోల్పోవడమే గాక తండ్రి తీవ్రంగా గాయపడ్డారు.
స్వగ్రామానికి వచ్చి అంతలోనే..
అయినవిల్లి మండలం చింతనలంక గ్రామానికి చెందిన విల్లా వీర్రాజు, పద్మావతి దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె నాగలక్ష్మికి వివాహమవగా చిన్న కుమార్తె గీతారాణి(24) ఇంజినీరింగ్ పూర్తిచేసి రెండేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో స్వగ్రామానికి వచ్చిన గీతారాణి తండ్రితో కలిసి వాడపల్లి ఆలయ దర్శనానికి శనివారం తెల్లవారుజామున బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం సుమారు 3.20 గంటల సమయంలో కొత్తపేట మండలం బోడిపాలెం
వంతెన వద్దకు రాగానే వెనక నుంచి టిప్పరు వేగంగా వచ్చి ఢీకొంది.
ద్విచక్రవాహనాన్ని సుమారు పదిమీటర్లు ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. గీతారాణి తలకి బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. తీవ్రంగా గాయపడ్డ వీర్రాజును కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి. సురేంద్ర తెలిపారు.
అల్లారుముద్దుగా పెరిగి..
గీతారాణి అంటే ఇంట్లో గారాబం. అల్లారుముద్దుగా ఆమెను పెంచారు. తండ్రి వ్యవసాయం చేస్తూ చదివించారు. అమ్మానాన్నల నమ్మకాన్ని నిలబెడుతూ మంచి కొలువు సాదించడంతో ఆనందంతో పొంగిపోయారు. తమ చుట్టుపక్కల ఆడపిల్లల్లో ఎవ్వరూ ఇలా చదివి ఉద్యోగం చేస్తున్నవారు లేరని, అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లి అంటూ బంధువులు విలపించారు. కొత్తపేట నుంచి రావులపాలెం వైపు లారీలు మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఇసుక లారీలు మృత్యుశకటాలుగా మారాయని వాపోయారు.
Also Read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





