July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

పెళ్లి బాజాలు మోగాల్సిన చోట.. చావు డప్పులు..

పాపన్నపేట(మెదక్‌)/వట్‌పల్లి(అందోల్‌): పెళ్లి వేడుకలు ఆ గ్రామాల్లో విషాదం నింపాయి. సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం మన్సాన్‌పల్లి వద్ద ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈఘటనతో మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం బాచారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 40 రోజుల క్రితం స్నేహితుడి నిశ్చితార్థానికి వెళ్లిన ముగ్గురు స్నేహితులు ఇదే రీతిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన మరువక ముందే జరిగిన ఘోరాన్ని తలుచుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామానికి చెందిన చెందిన సొంగ రాము పెళ్లి అందోల్‌కు చెందిన మమతతో గురువారం నార్సింగిలో జరగాల్సి ఉండగా ప్రమాదం జరిగింది. వధువు ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తెల్లారితే పెళ్లి అనగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో బంధువులతో కళకళలాడిన ఇళ్లు ఒక్కసారిగా మూగబోయింది.



విలపించిన కుటుంబ సభ్యులు
బూదమ్మ భర్త కిష్టయ్య గతంలోనే మరణించగా, కొడుకు లక్ష్మీనారాయణ కొరియర్‌ బాయ్‌గా పని చేస్తున్నాడు. కూతురు వివాహం జరిగింది. తల్లి మరణంతో కొడుకు ఎకాకిగా మారాడు. కాగా జెట్టిగారి సంగమ్మ భర్త గోపాల్‌ పక్షవాతంతో బాధపడుతున్నారు. ముగ్గురు కుమార్తెల పెళ్లిళ్లు కాగా కొడుకు ఉపాధి వేటలో ఉన్నాడు. కంటికి రెప్పలా చూసుకుంటూ సపర్యలు చేసే భార్య మరణించడంతో నాకు దిక్కెవ్వరు అంటూ గోపాల్‌ గుండెలు బాధుకున్నాడు. కాగా రావుగారి ఆగమ్మకు ఒక కూతురు, భర్త మల్లయ్య ఉన్నారు. కూతురు పెళ్లి కాగా మల్లయ్య, భార్య మరణంతో ఏకాకిగా మిగిలిపోయాడు. ఒక్కడినే ఎలా బతికేది అంటూ విలపించాడు.

సంగారెడ్డిలో క్షతగాత్రులకు చికిత్స
ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో 26 మంది గాయపడగా వారందరికీ జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి సంగారెడ్డికి తరలించారు. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు. ఎక్కువ మందికి తలకు గాయాలు కావడంతో స్కానింగ్‌ కోసం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అరుణ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

Also read

Related posts

Share via