April 16, 2025
SGSTV NEWS
CrimeTelangana

సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం

సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!

వరంగల్: ఉన్నత విద్యనభ్యసించాడు. ఎంతకూ పెద్ద ఉద్యోగం  రాలేదు. చివరికి ఓ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరాడు. వచ్చే వేతనం ఖర్చులకూ సరిపోవడం లేదు. మంచి ఉద్యోగం లేదని వచ్చిన పెళ్లి సంబంధాలు రద్దువుతున్నాయి. దీంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

గ్రామానికి చెందిన ఇంగోళి రాజేశ్వర్రావు, పద్మ దంపతుల కుమారుడు వేణు(30) బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగించి చివరికి తక్కువ వేతనానికి హైదరాబాద్లో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే వేతనం ఖర్చులకు సరిపోకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ విషయం తండ్రికి చెప్పడంతో వ్యవసాయం చేసుకుందామని చెప్పి ఓదార్చాడు. వ్యవసాయ పనులు చేయలేక పోయాడు. . ఏ పనిచేయలేక తల్లిదండ్రులకు భారంగా మారానని మదనపడుతున్నాడు

ఇదే తరుణంలో వేణుకు అనేక పెళ్లి సంబంధాలు చూశారు. వేణు ఉద్యోగ వివరాలు తెలుసుకున్నాక పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. ఇలా మూడు సంబంధాలు రద్దు అయ్యాయి. ఇక తనకు పెళ్లికాదని మనస్తాపంతో తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన అనంతరం ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన మృతుడి అమ్మమ్మ లచ్చమ్మ దారి వెంట వెళ్తున్న వారిని పిలిచి విషయం చెప్పి తలుపులు తీయించింది.

అప్పటికే వేణు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి చూడగా మృతిచెంది ఉన్నాడు. చేతికందొచ్చిన కుమారుడు బలవన్మరణానికి పాల్పడడంతో రాజేశ్వర్రావు, పద్మ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపారు.

Also Read

Related posts

Share via