ఇంకా పెళ్లి బట్టలు కూడా మాసిపోలేదు. గోరింటాకు చెదిరిపోలేదు. పెళ్లింట బంధువుల సందడి అలాగే ఉంది. నవ దంపతులు చిలకా గోరింకల్లా చూడ ముచ్చటగా ఉన్నారని ఊరంతా సంబరపడ్డారు. కానీ విధికి మాత్రం కన్నుకుట్టింది. పట్టుమని 15 రోజులకే కొత్త దంపతులు మరణించారు. కలిసి జీవిస్తామని బాసలు చేసినవారు కలిసే చనిపోయారని అందరూ కన్నీరు పెట్టారు.
బెంగళూరు: నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలని బంధుమిత్రులు చేసిన దీవెనలు ఫలించలేదు. ఆదివారం తెల్లవారుజామున 5:30 సమయంలో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం చెందారు. ఈ దుస్సంఘటన హావేరి జిల్లా శిగ్గావ్ తాలూకా కడహళ్లి గ్రామం సమీపంలోని 48వ జాతీయ రహదారిపై జరిగింది.
ఆలయానికి వెళ్లి వస్తుండగా..
వివరాలు.. శిగ్గావ్ నివాసులు కార్తీక్ హుగార్ (34), ఐశ్వర్య (30)కు 15 రోజుల క్రితమే ఆడంబరంగా వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ బంధువులతో కలిసి గదగ్ జిల్లా నవలగుందలోని కామణ్ణ ఆలయ దర్శనానికి కారులో వెళ్లి తిరిగివస్తున్నారు. ఘటనాస్థలిలో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొన్నారు. దంపతులు గాయాలతో అక్కడే కన్నుమూయగా, మల్లికార్జున, వినాయక అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు కలిసి నుజ్జయిన కారులో నుంచి శవాలను, క్షతగాత్రులను బయటకు తీసి శిగ్గావ్ ఆస్పత్రికి తరలించారు.
శోకసంద్రం..
ఇంటికి వస్తున్నామని చెప్పిన నవ దంపతులు కాటికి చేరారని తెలిసి ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆస్పత్రి బంధువుల రోదనలతో మార్మోగింది. ఘటనాస్థలిని జిల్లా ఎస్పీ యశోద వంటగోడి పరిశీలించారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తుకు గురవడం వల్లనే ఘోరం జరిగిందని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- ఉద్యోగం వస్తే ఇలా చేయాల్నా.. భర్తను కేసులతో హింసించిన భార్య.. పాపం చివరకు
- ఇద్దరు ప్రియురాళ్లను తీసుకుని వెళ్లి, దావత్ చేసుకున్న ప్రియుడు.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!
- AP News: చోరి సొమ్ము వాటాల పంపిణీలో బెడిసిన యవ్వారం.. గ్యాంగ్ లీడర్ హత్య!
- అతనికి 24.. ఆమెకు 16.. ఇన్స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?
- హైదరాబాద్లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్ఫోర్స్ దాడి..వెలుగులోకి షాకింగ్ నిజాలు! చూశారంటే





