SGSTV NEWS
CrimeTelangana

Telangana: పైకి చూసి పద్దతికి బ్రాండ్ అంబాసిడర్ అనుకునేరు.. అసలు మ్యాటర్ ఎంక్వయిరీలో తేలింది





సినిమాలు చూసి ఇలా ఇన్‌స్పైర్ అవుతారో.. లేక ఇలాంటి కేటుగాళ్లను ఆదర్శంగా తీసుకుని సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయో ఏమో కానీ.. హనుమకొండ జిల్లాలో వరుస దొంగతనాలతో హల్చల్ చేసిన ఓ ఘరానా దొంగ అడ్డంగా బుక్కయ్యాడు. తన గ్రామంలో వరుస దోపిడీలకు పాల్పడి అతనే పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణలో వారిని తప్పుదారి పట్టించాడు. సీన్ కట్ చేస్తే.!

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో వరుస దొంగతనాలు ప్రజలు వణికిపోయేలా చేస్తున్నాయి. నాలుగు రోజుల కిందట ఓ ఇంట్లో దొంగతనం కోసం వచ్చిన దొంగ.. ఇంట్లో ఉన్న గర్భిణి గమనించడంతో ఆమెను హత్య చేసేందుకు కొడవలితో దాడి చేశాడు. చనిపోయిందనుకుని ఆమె ఒంటిపై నగలతో పరారయ్యాడు. అనంతరం ఏమీ తెలియనట్టుగా వచ్చి బాధిత కుటుంబసభ్యులతో కలిసి డయల్ 100కు కాల్ చేశాడు. కుటుంబసభ్యులతో హడావుడి చేస్తూ బాధితురాలిని ఆసుపత్రికి తరలించాడు. చివరకు చనిపోయిందనుకున్న గర్భిణి కాస్తా స్పృహలోకి రావడంతో.. యువకుడి బండారం బయటపడింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన చిలువేరు ప్రశాంత్ ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటుపడి నష్టపోయాడు. జల్సాల కోసం అప్పులు చేసి వాటిని తీర్చేందుకు దొంగతనాలకు అలవాటుపడ్డాడు. వంగపల్లి గ్రామంలో అందరితో కలివిడిగా ఉంటూనే వారి ఇండ్లలో చోరీలకు పాల్పడటం మొదలుపెట్టాడు. ఇలా కొద్దిరోజుల కిందట తన దగ్గరి మిత్రుడైన కొడెపాక మధుసూదన్ ఇంట్లో చోరీకి పాల్పడి రూ.60 వేలు విలువ చేసే బంగారం ఎత్తుకెళ్లాడు. ఆ తరువాత పశువుల రమాదేవి ఇంటికి తాళం వేసి ఉండగా.. అందులో చొరబడి రూ.2 లక్షల విలువచేసే నగలు దోచుకెళ్లాడు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా బాధితులతో కలిసి కమలాపూర్ స్టేషన్‌కు వెళ్లి మరీ పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. విచారణలో పోలీసులకు అన్నీ పిట్టకథలు చెప్పి దర్యాప్తు దారి మళ్లి్ంచాడు. చోరీలకు అలవాటుపడిన చిలువేరు ప్రశాంత్ మే 30న ఎలుకటి దిలీప్ ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో దివ్య అనే గర్భిణి అతడిని గమనించింది. దీంతో తన బాగోతం బయటపడుతుందని భావించిన ప్రశాంత్.. ఆమెను చంపేందుకు ప్రయత్నం చేశాడు. కొడవలితో తలపై దాడి చేశాడు. ఆమె చనిపోయిందనుకుని ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్టుగానే వెనక్కి వచ్చి, బాధిత కుటుంబ సభ్యులతో కలిసి డయల్ 100కు కాల్ చేశాడు.

తనే దగ్గరుండి గాయపడిన గర్భిణిని గ్రామస్థులతో కలిసి కమలాపూర్ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా ఆసుపత్రికి వెళ్లాక స్పృహలోకి వచ్చిన గర్భిణి తనపై చిలువేరు ప్రశాంత్ దాడి చేసినట్లు కుటుంబ సభ్యులకు తెలిపింది. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 8 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వంగపల్లి గ్రామాన్ని వరుస చోరీలతో వణికించిన దొంగ మన ఊరి వాడే అని తెలియడంతో ఊరంతా ఉలిక్కి పడ్డారు

Also read

Related posts

Share this