పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి భావితరాలకు బంగారు భవిష్యత్తు వైపు తీర్చిదిద్దాల్సిన ఆ పాపిష్టి చేతులే తన భర్త హత్యకు స్కెచ్ వేయడం ప్రతి ఒక్కరిని నివ్వెరపోయేలా చేసింది. మరోవైపు ఎవరైనా తప్పు చేస్తే వారిని దండించాల్సిన బాధ్యత కలిగిన కానిస్టేబుల్ నేరుగా హత్యాయత్నం చేయడం కలకలం రేపింది.
యువ వైద్యుడిపై హత్యాయత్నం ఘటనలో సమాజం నివ్వెరపోయే నిజాలు ఇవి..! నేరస్తులలో ఒకరేమో భావితరాలకు భవిష్యత్ పాఠాలు నేర్పే అధ్యాపకుడు.. మరొకరు నేరం చేసిన వారిని దండించే క్రమశిక్షణ కలిగిన ఖాకీ..! అలాంటివారే హంతకులుగా మారితే సమాజం ఎటుపోతున్నట్లు..! వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన యువ డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం ఘటనలో పోలీసులు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.
యువ వైద్యుడి భార్య ప్రభుత్వ లెక్చరర్. తన ప్రియుడికి సుపారీ ఇచ్చి ఓ కానిస్టేబుల్ తో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసినట్లు వరంగల్ పోలీసులు నిర్ధారించారు.. వివాహేతర సంబంధమే ఈ రక్తపు మరకలు వెనకున్న అసలు నిజం అని తేల్చారు. ఆ నీచులను అరెస్టు చేసిన పోలీసులు ముగ్గురిని కటకటాల్లోకి పంపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఫిబ్రవరి 20వ తేదీన వరంగల్ లో సంచలనం సృష్టించిన యువ డాక్టర్ సుమంత్ రెడ్డి పై హత్యాయత్నం ఘటన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ దారుణ ఘటన వెనుక అసలు సంచలన నిజాలను బయట పెట్టారు. వరంగల్ – కాజీపేట మద్య బట్టుపల్లి బైపాస్ రోడ్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. కారులో ఒంటరిగా వెళ్తున్న సుమంత్ రెడ్డి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కారును వెంబడించి హత్యాయత్నం చేశారు. నడిరోడ్డుపై అతని కారు ఆపి విచక్షణారహితంగా ఇనుపరాడ్లతో కొట్టి అతను చనిపోయాడనుకుని వదిలేసి అక్కడి నుండి పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సుమంత్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుమంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఈ రక్తపు మరకలు ఓరుగల్లు నగరమంతా ఉలిక్కిపడేలా చేశాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా హత్యకు ప్లాన్ వేసిన నేరస్తులను పట్టుకున్నారు. అయితే మృత్యువుతో పోరాడుతున్న ఆ వైద్యుడి భార్యే ఈ మర్డర్ స్కెచ్ వెనుకున్న ప్రధాన సూత్రధారి, పాత్రధారి కావడం పోలీసులను నివ్వెరపోయేలా చేసింది.
డాక్టర్ సుమంత్ రెడ్డి – ఫ్లోరా మరియాకు 2016లో వివాహం జరిగింది. సంగారెడ్డి PHCలో వైద్యుడిగా పనిచేసేవాడు సుమంత్. అతని భార్య ఫ్లోరా మరియా ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేసేది. ఈ క్రమంలో సంగారెడ్డిలో ఫిట్నెస్ కోసం జిమ్ కు వెళ్తున్న వైద్యుడి భార్య ఫ్లోరా మరియా జిమ్ ట్రైనర్ శామ్యూల్ తో ప్రేమలో పడింది. వాళ్ల పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వాళ్ళ యవ్వారం డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలియడంతో భార్యను మందలించి అక్కడి నుండి వరంగల్ తీసుకువచ్చారు.
కాజీపేటలో ఓ క్లినిక్ పెట్టుకుని తన వైద్య వృత్తిని కొనసాగిస్తున్నాడు. 2019లో ఫ్లోరా మరియాకు సాంఘిక సంక్షేమశాఖలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. కానీ ఫ్లోరా మరియా ప్రవర్తనలో మాత్రం మార్పులేదు. తన ప్రియుడు శామ్యూల్‌తో యథావిధిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. నిత్యం ఫోన్ లో వీడియో కాల్స్ మాట్లాడడం.. వీకెండ్స్‌లో కలుసుకుంటూ వీళ్ళ వివాహేతర సంబందాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం భర్త సుమంత్ రెడ్డికి తెలియడంతో మరోసారి మందలించాడు. ఈ క్రమంలో తనకు విడాకులు కావాలని భర్త పైన ఒత్తిడి తెచ్చింది. కానీ విడాకులు ఇవ్వడానికి సుమంత్ రెడ్డి నిరాకరించడంతో తన భర్తను కడతేర్చాలని ఖతర్నాక్ స్కెచ్ వేసింది.
నెల రోజుల క్రితం తన ప్రియుడు శామ్యూల్ పిలిపించిన ఫ్లోరా మరియా భర్త డాక్టర్ సుమంత్ రెడ్డి మర్డర్‌కు స్కెచ్ వేసింది. తన భర్తను ఎలాగైనా హతమార్చాలని ప్రియుడికి సూచించి ఖర్చుల కోసం ఒక లక్ష రూపాయలు అతనికి ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసింది. అయితే ప్రియురాలి సుపారీతో మర్డర్ ప్లాన్ చేసిన శామ్యూల్ తన స్నేహితుడు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజు సహాయంతో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ హత్య ఘటనలో సహకరించిన రాజుకు పని ప్రశాంతంగా పూర్తయితే ఒక ఇల్లు కట్టిస్తామని ఒప్పందం మేరకు అతన్ని ఇందులో పాత్రధారుడిని చేశారు.
పర్ఫెక్ట్ క్లూస్ తో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పూర్తి ఆధారాలను సేకరించి వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేవలం వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణమని తెలిపారు. తన ప్రియుడితో భర్తను హతమార్చడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ ఫ్లోరా మరియా స్కెచ్ వేసిందని తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రధాన నిందితురాలు డాక్టర్ ఫ్లోరా మరియా సాంఘిక సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ కావడం విశేషం. ప్రస్తుతం రంగశాయిపేట ప్రాంతంలోని గురుకులంలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. తన ప్రియుడు జిమ్ ట్రైనర్ గా సంగారెడ్డిలో జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. హత్యలో పాల్గొన్న వ్యక్తి రాజ్ కుమార్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ హత్య కోసం ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ మూడు రోజులు సెలవు పెట్టి మరీ ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి భావితరాలకు బంగారు భవిష్యత్తు వైపు తీర్చిదిద్దాల్సిన ఆ పాపిష్టి చేతులే తన భర్త హత్యకు స్కెచ్ వేయడం ప్రతి ఒక్కరిని నివ్వెరపోయేలా చేసింది. మరోవైపు ఎవరైనా తప్పు చేస్తే వారిని దండించాల్సిన బాధ్యత కలిగిన కానిస్టేబుల్ నేరుగా హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు.
Also read
- శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..
- Blood Moon on Holi: హోలీ రోజున ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్.. కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణం
- నేటి జాతకములు…14 మార్చి, 2025
- ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…
- XXX సోప్స్ అధినేత మృతి