July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‎గా మాజీ ఎమ్మెల్యే.. కేసు నమోదు చేసిన పోలీసులు..

వివాదాస్పద నేతగా నిత్యం వార్తల్లో నిలిచే జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. భూకబ్జా ఆరోపణల్లో ఆయనపై జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. సొంత పార్టీకే చెందిన జనగామ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గాడిపళ్లి ప్రేమలతారెడ్డి కుమారుడు గాడిపళ్లి రాజేందర్ రెడ్డి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిటకొడూరు గ్రామ శివారులోని తన పట్టాభూమి 214 సర్వే నెంబర్‎లో గల ఐదుఎకరాల 17 గంటల సాగుభూమిని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెందిన 39 సర్వే నెంబర్‎లోకి అక్రమంగా బదలాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జనంగా భూకబ్జా చేయడమే కాకుండా తనపై అక్రమ కేసులు పెట్టించి అనేక ఇబ్బందులకు గుర్తు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ప్రశ్నించిన పాపానికి తన కుటుంబ సభ్యులను బెదిరించడమే కాకుండా తనను విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆ ఫిర్యాదులో రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

రాజేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు..
జనగామ ఏసిపి అంకిత్ కుమార్ శంక్వాడ్, జనగామ ఆర్డీవో, రెవెన్యూ అధికారుల సమక్షంలో విచారణ జరిపారు. వివాదాస్పద భూమిని పరిశీలించి పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అనంతరం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ఆయన అనుచరుడు భూరెడ్డి ప్రమోద్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. జనగామ పోలీస్ స్టేషన్లో 447, 427, 506 r/w34 ఐపిసి సెక్షన్‎లో కేసులు నమోదయ్యాయి. రేపో మాపో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. గతంలో తన సొంత కూతురే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై అనేక ఆరోపణలు చేశారు. తన తండ్రి కబ్జా కోరు అని చేర్యాల భూమి విషయంలో కన్న తండ్రి పైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో అనేకసార్లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై భూ వివాదాల కేసులు చుట్టుముట్టాయి. అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధికారంలో ఉన్నంతకాలం ఆరోపణలు కొట్టి పారేసిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇప్పుడు తాజాగా మరో కేసులో ఇరుక్కోవడం చర్చగా మారింది

Also read

Related posts

Share via