అత్యంత పాశవికమైన హత్య.. చంపిన తీరు వినాలంటేనే భయమేస్తోంది. హైదరాబాద్ మీర్పేట్లో భార్యను చంపిన భర్త కేసు వింటేనే జుగుప్సాకరంగా ఉంది. భార్య మాధవిని చంపేసిన గురుమూర్తి.. శవాన్ని మాయం చేసేందుకు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. శరీర భాగాలను జిల్లెలగూడ చెరువులో పడేసి.. పోలీసులకు ఒక్క ఆధారం కూడా దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. అయితే.. విచారణలో చంపింది గురుమూర్తేనని నిర్థారించుకున్న పోలీసులు.. మర్డర్‌ను సాంకేతికంగా నిరూపించే ఆధారాలు సేకరించారు.
ఒక మనిషి ఇంత క్రూరంగా, దారుణంగా మరో మనిషిని చంపుతాడా? దర్యాప్తు అధికారులే గగుర్పాటుకు గురయ్యారు. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతంగా చంపినా ఆ నిందితుడిలో కించిత్ పశ్చాత్తాపం కూడా లేదు. మీర్పేట్ హత్యకేసును ఛేదించాక రాచకొండ పోలీసులు చెప్పిన మాటలివి..!
హైదరాబాద్ శివారు మీర్పేట్లో భార్యను చంపిన గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు నిజాలు కక్కించారు. గురుమూర్తి అనడం కన్నా క్రూరమూర్తి అంటే సరిగ్గా సరిపోతుంది. భార్యను అత్యంత కిరాతకంగా చంపేసి, శరీర భాగాలను నరికేసి.. స్టవ్‌పై కాల్చేసి, పొడి చేసి చెరువులో పడేశాడీ దుర్మార్గుడు. తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును సైంటిఫిక్ ఆధారాలతో ఛేదించారు రాచకొండ పోలీసులు. నిందితుడు గురుమూర్తిని అరెస్ట్ చేసి, BNS 103(1), 238, 85 సెక్షన్లకింద కేసు నమోదు చేశారు. హత్యకు ఉపయోగించిన 16 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
సంక్రాంతికి వెంకటమాధవి, గురుమూర్తి తమ పిల్లలను తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లారు. జనవరి 15న పిల్లలను బంధువుల ఇంటి వద్దే వదిలేసి వెంకట మాధవి, గురుమూర్తి రాత్రి ఇంటికి చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు పోలీసులు. 16వ తేదీన ఉదయం మాధవితో అకారణంగా గొడవ పెట్టుకుని తీవ్రంగా కొట్టి.. తలను గోడకేసి బాదాడు గురుమూర్తి. ఆ తర్వాత ఆమెపై కూర్చుని గొంతు నులిమి చంపేశాడు. మాధవి చనిపోయిందని నిర్ధారించుకున్నాక, ఆమె కాళ్లను నరికేశాడు. తర్వాత చేతులను శరీర భాగాలను ముక్కలుగా నరికేశాడు. చివరికి తలను మొండెం నుంచి వేరే చేసి వాటర్ హీటర్ సాయంతో నీటిలో ఉడికించాడు. ఆ ఉడికించిన శరీరభాగాలను స్టవ్‌పై కాల్చి పొడిచేశాడు. ఎముకలను రోట్లో వేసి దంచి, పొడి చేసి తీసుకెళ్లి మీర్పేట్ పెద్ద చెరువులో పడేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు.
మాధవి బంధువులు నిలదీయడంతో గురుమూర్తి మిస్సింగ్ కేసు పెట్టించారు. తర్వాత పోలీసుల విచారణలో మాధవిని చంపినట్టు ఒప్పుకున్నాడు. హత్యపై సైంటిఫిక్ ఆధారాలను సేకరించామని సీపీ సుధీర్ బాబు తెలిపారు. హత్యకు కారణాలేంటో కస్టడీలో విచారిస్తామన్నారు. ఇలాంటి ఘాతుకాలకు ఇంకెవరూ పాల్పడకుండా నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. తన సర్వీసులో ఇంతవరకు ఇలాంటి దుర్మార్గపు ఆలోచన కలిగిన వ్యక్తి చూడలేదని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పడం విశేషం
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




