December 19, 2024
SGSTV NEWS
CrimeTelangana

Telangana: కనికరం లేని కోడలు.. వీల్ చైర్‌లో ఉన్న మామపై విచక్షణారహిత దాడి..!

వీల్ చైర్ లో ఉన్న మామ ముఖంపై చెప్పుతో దాడి చేసింది. ఆర్తనాదాలు చేస్తూ తనను కొట్ట వద్దంటూ కాళ్లకు పట్టుకొని దండం పెట్టిన ఆ కోడలు మాత్రం కనికరించలేదు.



మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ఈ ఘటన అక్షరాల నిరూపించింది. తమకు తక్కువ వాటా భూమిని ఇచ్చారనే కోపంతో తండ్రిలా చూసుకోవాల్సిన మామను కోడలు చెప్పుతో దాడికి దిగింది. వృద్ధుడైన మామను.. కోడలు కొడుతుంటే నోరులేని మూగజీవం.. విశ్వాస జంతువుగా పేరు ఉన్న శునకానికి ఉన్న కనికరం ఆ మనిషికి లేకుండాపోయింది. కుక్క మాత్రం దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ అమానవీయ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టి పాలానికి చెందిన గక్కినెపల్లి బుచ్చి రెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. ఉన్నంతలో వీరిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారు. తనకున్న తొమ్మిది ఎకరాల భూమిలో ఆరు ఎకరాలు ఇద్దరు కొడుకులు ఇచ్చి మూడు ఎకరాలు తన జీవనోపాధికి తన వద్దే ఉంచుకున్నాడు. ఇటీవల చిన్న కుమారుని కొడుకు దినేష్ రెడ్డికి మూడు ఎకరాల భూమిని బుచ్చిరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో వీరి మధ్య భూ వివాదం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో వృద్ధుడైన బుచ్చిరెడ్డి వీల్ చైర్ లో కూర్చుని ఉన్నాడు. పెద్ద కోడలు మణిమాల అక్కడి వచ్చి.. మామ బుచ్చిరెడ్డి పై దాడికి దిగింది. చెప్పుతో మామపై విచక్షణారహితంగా కోడలు దాడికి తెగబడింది. వీల్ చైర్ లో ఉన్న మామ ముఖంపై చెప్పుతో దాడి చేసింది. ఆర్తనాదాలు చేస్తూ తనను కొట్ట వద్దంటూ కాళ్లకు పట్టుకొని దండం పెట్టిన ఆ కోడలు మాత్రం కనికరించలేదు. కానీ విశ్వాసానికి మారుపేరైన కుక్క మాత్రం మామను కోడలు కొడుతుండగా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అటు ఇటు తిరుగుతూ వృద్ధుడిని కొట్టకుండా ఆపే ప్రయత్నం చేసింది. దాడి దృశ్యాలన్నీ సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. వృద్ధుడిపై కోడలు చేస్తున్న దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మానవత్వం లేకుండా మామపై కోడలు చేస్తున్న దాడి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read

Related posts

Share via