SGSTV NEWS online
Andhra PradeshCrime

పాఠశాల నిర్మాణ పనుల్లో అపశ్రుతి – క్రేన్‌ కూలి ఉపాధ్యాయురాలు మృతి



ప్రభుత్వ పాఠశాలలో క్రేన్‌ కూలి ఉపాధ్యాయురాలు మృతి – దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత



అనకాపల్లి జిల్లా రాజానగరం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉదయం అపశ్రుతి చోటు చేసుకుంది. శ్లాబ్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. సామగ్రి మోసుకెళ్లే క్రేన్ కూలి ఆ స్కూల్లో పని చేస్తున్న టీచర్ మృతి చెందారు. ఈ ఘటనతో అందరూ షాక్కు గురయ్యారు.

అసలేం జరిగిందంటే? : అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని రాజానగరం ఉన్నత పాఠశాలలో ఆవరణలో కళావేదిక నిర్మాణం జరుగుతోంది. శుక్రవారం ఉదయం కళావేదిక వద్ద శ్లాబ్‌ వేసేందుకు క్రేన్ సాయంతో సామగ్రి పైభాగానికి తరలిస్తున్నారు. ఇదే సమయంలో క్రేన్‌ కూలి పాఠశాల లోపలికి వెళ్తున్న ఆంగ్ల ఉపాధ్యాయురాలు జోష్నా భాయ్‌ (45)పై సామగ్రి పడింది. గాయపడిన ఆమెను హుటాహుటిన తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు మార్గమధ్యలోనే ఆమె మృతి చెందారు. ఈ ఘటన అందరినీ కలచి వేసింది.


మంత్రి అనిత దిగ్భ్రాంతి : శ్లాబ్‌ సామగ్రి మోసుకెళ్లే క్రేన్‌ కూలి అనకాపల్లి జిల్లాలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు జోష్నా భాయ్ మృతి చెందడం పట్ల హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. దీనిపై మంత్రి విచారణకు ఆదేశించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


విచారం వ్యక్తం చేసిన లోకేశ్ : పాఠశాల కళావేదిక నిర్మాణ పనుల్లో శ్లాబ్‌ సామగ్రి మోసుకెళ్లే క్రేన్‌ కూలి ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీచర్ కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు




Also Read

Related posts