వైసీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక టీడీపీ సీనియర్ కార్యకర్త శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
చీరాల : వైసీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక టీడీపి సీనియర్ కార్యకర్త శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరిపాలెంలో చోటుచేసుకుంది. సూసైడ్ నోట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. కావూరిపాలెం పరిధిలోని బొగ్గులవారిపాలెంకు చెందిన కోట వెంకటేశ్వరరెడ్డి అలియాస్ బుజ్జిరెడ్డి(50) 32 ఏళ్లుగా టీడీపి లో చురుగ్గా పని చేసేవారు. ఇటీవల గ్రామంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో సీఎం చంద్రబాబును కించపరిచే పాటలు పెట్టొద్దన్నందుకు స్థానిక వైసీపీ కార్యకర్తలు ఆయన్ను వేధించసాగారు. అతని కుటుంబంతో గ్రామస్థులు ఎవరైనా మాట్లాడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో మనస్తాపం చెందిన బుజ్జిరెడ్డి ఈ నెల ఒకటిన పురుగుమందు తాగారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొంది, వారం కిందటే గ్రామానికి వచ్చారు. అప్పటి నుంచి వైసీపీ వాళ్ల వేధింపులు ఇంకా పెరగడంతో శనివారం తెల్లవారుజామున తన ఇంటి ఎదుట పందిరికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ‘నా ఆత్మహత్యకు వైసీపీ కు చెందిన కుంచాల పొట్టయ్య, కుంచాల చిన్న, కావూరి ఎర్ర శ్రీనివాసరెడ్డి కారణం. వారిని శిక్షించాలి’ అని బుజ్జిరెడ్డి జేబులో లభించిన లేఖలో రాసి ఉంది. పోలీసులు లేఖను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.
Also read
- నేటి జాతకములు 31 జూలై, 2026
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





