SGSTV NEWS online
Spiritual

దేవుడికి అరటిపండు, కొబ్బరికాయ ఎందుకో తెలుసా? – ఆ రహస్యం ఇదే!



పూజా సంవిధానంలో “అరటిపండు, కొబ్బరికాయ” తప్పనిసరి! – అందుకు గల కారణాలు వివరిస్తున్న ఆధ్యాత్మికవేత్తలు

మనం ఇంట్లో పూజ చేసినప్పుడు లేదా దేవాలయాలకు వెళ్లినప్పుడు భగవంతుడికి అరటిపండ్లు సమర్పించడం, కొబ్బరికాయలను కొట్టడం చేస్తుంటాం. హిందూ సంప్రదాయం ప్రకారం భగవంతుని పూజలైనా, ఇంట్లో శుభకార్యాలైనా కొబ్బరికాయ కొట్టనిదే పూజ పూర్తి కాదు. అయితే, దైవానికి పూజా సంవిధానంలో పలు పదార్థాలను సమర్పించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఈ సందర్భాల్లో ఎలాంటి సంప్రదాయాలను పాటించాలి? అనే ప్రశ్నలకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి ఈవిధంగా సమాధానమిస్తున్నారు.

నిజానికి దేవుడికి సమర్పించేది ఏదీ ఎంగిలి కాకూడదని హిందూ సంప్రదాయం చెబుతోంది. ఎంగిలి అంటే ఒకదాని చేత స్పర్శించినది. పువ్వులు స్వామివారి దగ్గర పెడుతున్నాం. అప్పుడు ఆ పువ్వులు ఎంగిలిగా మారాయి. ఎందుకంటే తుమ్మెద వాలి ఉంది, దాని మకరందాన్ని తీసుకుని ఉంటుంది. రకరకాల పూలలో రకరకాల తుమ్మెదలు వాలుతాయి. అవన్నీ కలిసి తేనేతుట్టెను నిర్మిస్తుంటాయి. కాబట్టి, ప్రతి పువ్వు కూడా తుమ్మెద స్పర్శతోని ఉంటుంది. అంటే, ఎంగిలి అయినట్లే! మరి, ఎంగిలి పువ్వును తీసుకొచ్చి మనం స్వచ్ఛమైన పువ్వు కింద భావించి స్వామివారి దగ్గర పెడుతున్నాం. కానీ, స్వామివారికి ఎంగిలి కాకుండా ఉన్నదాన్ని పెట్టాలి. ఎందుకంటే ఎంగిలి చేసినవాటిని భగవంతుని దగ్గర పెట్టడానికి ఏ భక్తునికి కూడా మనసొప్పద్దు. ఈ క్రమంలోనే ఎంగిలి కానిదేమిటి అంటే.. రెండే రెండు ఉన్నాయని చెబుతున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి. అందుకే, ఆ రెండు తప్పనిసరిగా పూజల్లో పెట్టండని శాస్త్రంలో చెప్పారు. అవే, “అరటిపండు, కొబ్బరికాయ”. అందుకే, మనం ఏ పూజ చేసినా కూడా హిందూ సంప్రదాయం తెలిసినవాళ్లందరూ తప్పనిసరిగా ఈ రెండింటిని పెడుతుంటారు.

కొన్నిచోట్ల దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టడానికి ప్రదేశాలు దొరకవు. అయితే, కొబ్బరికాయ కొట్టంది గుడిలోకి వెళ్లినటువంటి హిందూ సంప్రదాయవాదికి మనసొప్పదు. ఎక్కడో ఓ చోట కొబ్బరికాయ కొట్టాలి అది తీసుకొచ్చి స్వామివారికి నివేదన చూపించాలి. ఎందుకంటే, ఈ లోకంలో ఏ చెట్టు అయినా సరే ఒక చెట్టు నుంచి పుట్టినటువంటి విత్తనంతో మళ్లీ పుడుతుంది. అంటే, అది ఎంగిలి. ఏ చెట్టునైనా తీసుకోండి.. ఒక చెట్టు నుంచి ఉన్నటువంటిదే విత్తనాల కింద మారుతాయి. ఆ విత్తనం వేస్తేనే మళ్లీ ఇంకో చెట్టు వస్తుంది. కానీ, కొబ్బరి చెట్టుకు మాత్రం అది పుట్టినప్పుడే రకరకాల మొక్కల కింద పుడుతుంది. ఆ మొక్కలను విడివిడిగా నాటుతూ ఉంటుంటాం. కాబట్టి, కొబ్బరికాయకు ఎంగిలి లేదు. అందుకే, కొబ్బరికాయ తప్పనిసరిగా నైవేద్యాల్లో పెట్టారని చెబుతున్నారు

అలాగే, అరటిపండుకూ ఆ రకంగానే ఎంగిలి లేదు అంటున్నారు. అరటిచెట్టు కూడా ఆవిధంగానే రకరకాల అరటిచెట్ల నుంచి వస్తోంది. అంతేకానీ, ఒకే అరటిచెట్టులో ఉండే విత్తనాలు తీసి ఇంకో చెట్టు ఎక్కడా నాటరు. అందువల్ల ఎంగిలితనం అరటిచెట్టు దగ్గర కూడా లేదు. కాబట్టి, ఈ లోకంలో ఎంగిలితనం లేనటువంటివి, స్వచ్ఛమైనటువంటివి ఇవి రెండే అని చెబుతున్నారు ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి. మిగతా నీళ్లు ఏవైనా సరే వివిధ కారణాల వల్ల ఎంగిలి కావొచ్చునేమో.. కానీ, కొబ్బరినీళ్లు ఎంగిలి కావడానికి ఛాన్స్ లేదు. అటువంటి స్వచ్ఛత కలిగినటువంటిది కొబ్బరికాయ అని అంటున్నారు

కొబ్బరికాయ మనకు ఏం ప్రబోధ చేస్తుందంటే, సాధారణంగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత పైన ఉన్న పీచును తీసేయాలి. ఆపై రెండు చిప్పలను అక్కడ పెట్టాలి. కానీ, చాలా మంది పైన ఉన్న పీచును తీయకుండా అలానే పెడుతుంటారు. అలా చేయడం పొరపాటు అంటున్నారు. దానివల్ల మళ్లీ బంధం కలుగుతుందంటున్నారు. లోకంలో ఉన్న బంధాలన్నీ తొలగించేయవయ్యా, మళ్లీ బంధాలు కలిగించే జన్మ నాకు ప్రసాదించకు అని దేవుడిని ప్రార్థించడానికి కొబ్బరికాయపైన ఉండే పీచును తొలగించేయాలంటున్నారు ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి.

అలాగే, ఏ కాయకు లేనటువంటిది త్రినేత్రత్వం. అదే కొబ్బరికాయకు శివుడికి ఉన్నట్లే మూడు కన్నులున్నాయి. కొబ్బరికాయ శివుడు లాంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తుంది. మొత్తానికి ఎంగిలి కానటువంటి పదార్థాలు కాబట్టి కొబ్బరికాయ, అరటిపండును మాత్రమే ప్రతి గుడిలోనూ పెడతారు. ప్రతి వారూ హిందూ సంప్రదాయంలో వాడతారని చెబుతున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు

Also read

Related posts