SGSTV NEWS online
Andhra PradeshCrimeViral

అబ్రకదబ్ర.. పేపర్ చదువుతుండగా మాయమైన స్కూటీ.. ఓర్నీ దుంపతెగ..



ప్రకాశం జిల్లా అద్దంకిలో విచిత్రమైన స్కూటీ చోరీ ఘటన చోటుచేసుకుంది. స్కూటీని షాపు ముందు ఆపి పేపర్ చదవడంలో మునిగిపోయిన యజమాని, తాళం తీసేయడం మరిచిపోవడంతో దొంగకు అవకాశం దొరికింది. యజమాని కళ్లెదుటే స్కూటీని స్టార్ట్ చేసి నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ప్రకాశం జిల్లా అద్దంకిలో యజమాని కళ్ళెదుటే స్కూటీ చోరీకి గురైన వెరైటీ ఘటన చోటు చేసుకుంది. తాళం వేయకుండా బండిని వదిలేస్తే ఈ రోజుల్లో దొంగలు ఎంత స్పీడ్‌గా పని కానిచ్చేస్తారో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.. అద్దంకి పట్టణానికి చెందిన చేబ్రోలు వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి తన ఎలక్ట్రికల్ స్కూటీపై బంగ్లా రోడ్డు సెంటర్‌కు వచ్చాడు. అక్కడ ఒక షాపు ముందు బండి ఆపి.. తాళం వేయడం మరిచిపోయాడు సరికదా, ఆ తాళాన్ని తీయడం కూడా మరిచిపోయాడు. స్కూటీకి ఎదురుగానే బైఠాయించి హాయిగా పేపర్ చదువుకోవడంలో మునిగిపోయాడు. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక దొంగ.. స్కూటీపై కన్నేశాడు..




స్కూటీకి తాళం కీ-హోల్‌లోనే ఉండటాన్ని గమనించాడు. ఇంకేముంది, యజమాని పేపర్ చదవడంలో బిజీగా ఉండటాన్ని చూసి, మెల్లగా స్కూటీ ఎక్కి స్టార్ట్ చేసి రెప్పపాటులో అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. పేపర్ చదవడం పూర్తయ్యాక చూసేసరికి అక్కడ బండి లేకపోవడంతో వెంకట సుబ్బయ్య షాక్‌కు గురయ్యాడు. తన స్కూటీకి చోరీకి గురైందని తెలుసుకుని చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


స్కూటీ చోరీ చేసిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Also read

Related posts