*నేడు శ్రీ కూర్మ జయంతి*
*దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. అందులో రెండో అవతారం కూర్మావతారం. కృతయుగంలో దేవ , దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు. మందరగిరిని కవ్వంగా , వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగింది. ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువు వేడుకున్నారు.*
*అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మవతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అబేధాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతోంది.*
*శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. కళింగరాజైన అనంగభీముడు కూర్మనాధస్వామి ఆలయాన్ని పునర్‌నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కర్పూరేశ్వరుడు , హఠకేశ్వరుడు , సుందేశ్వరుడు , కోటేశ్వరుడు , పాతాళ సిద్దేశ్వరుడు అనే అయిదుగురు ఈశ్వరులు క్షేత్రపాలకులుగా వున్న ఈ క్షేత్రం కళింగరాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిందనీ , కళింగ రాజుల కాలంలో అత్యంత విశిష్టతను చేకూర్చిందని చరిత్ర చెబుతోంది.*
*కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు , అతని భార్య వంశధారల తపస్సుకు , భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ , బ్రహ్మాండ , పద్మ పురాణాలలో వుంది.*
*శ్రీరాముడు , బలరాముడు , జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు.*
*ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట.*
*దేవతలచే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రివేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా వుంటాయని ఒక కథనం.*
*శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ , అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు. మరణించినవారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు.*
*ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడ వున్న విష్ణుపాదాల దగ్గర పిండప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం ఇక్కడ చేసిన పితృకర్మలకు గయలో పితృకర్మలు చేసిన ఫలితం లభిస్తుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.*
*ఇక శ్రీ కూర్మ జయంతి రోజున స్వామివారిని దర్శించుకునే వారికి సకల పాపాలు హరింపవేయబడుతాయని విశ్వాసం. అలాగే ప్రతి సంవత్సరం మార్చిలో హోళీ పున్నమినాడు పెద్దఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశినాడు స్వామికి కల్యాణోత్సవం , కూర్మ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.*
*కూర్మావతార వర్ణిన*
*అగ్ని దేవుడు వశిష్ఠునితో “వశిష్ఠా ! ఇప్పుడు కూర్మావతారమును వర్ణించుచుంటిని వినుము. దీనిని వినిన సమస్త పాపములు నశించును. పూర్వము దేవాసుర సంగ్రామమున దైత్యులు దేవతలను ఓడించిరి. వీరికి దుర్వాసుని శాపము వలన లక్ష్మికూడ తొలగిపోయెను. సమస్త దేవతలు క్షీరసాగరమందు శయనించి యున్న విష్ణు భగవానుని చెంతకేగి “భగవాన్ ! తమరు దేవతలను రక్షించవలెను” అని ప్రార్థించిరి.*
*శ్రీహరి , బ్రహ్మాది దేవతలతో “దేవగణములారా ! మీరు క్షీర సముద్రమును మధించుడు. అమృతమును పొందుటకును , లక్ష్మీప్రాప్తి గలుగుటకును మీరు అసురులతో సంధి చేసికొనవలెను. ఏదైననూ ఒక మహత్కార్యము నిర్వహించవలెనన్న ఒక మహత్ప్రయోజనము పొందగోరినను , శత్రువులైనను సంధి చేసికొనవలెను. నేను మిమ్ములను అమృతమునకు హక్కుదారులను చేసి దైత్యులను వంచితులను గావించెదను. మీరు దైత్యరాజు బలి చక్రవర్తిని నాయకునిగా నియమించుకొని మందరాచలమును కవ్వముగచేసి , వాసుకి సర్పమును కవ్వపు త్రాడుగచేసి , నా సహాయమును కూడ పొంది , క్షీరసాగరమును మధించుడు” అని చెప్పగా దేవతలు , దైత్యులతో సంధి చేసికొని , క్షీర సముద్రమును చిలుకుట ప్రారంభించిరి. వాసుకి సర్పము తోకవైపు దేవతలు నిలచిరి. వాసుకి సర్ప నిఃశ్వాసములకు దానవులు బలహీనులగుచుండిరి. దేవతలు భగవానుని కృపాదృష్టితో బలవంతులగుచుండిరి.*
*సముద్ర మథనము ప్రారంభమయ్యెను. ఏమియు ఆధారము లేకపోవుటచే మందరాచలము సముద్రమున మునిగిపోయెను. అప్పుడు విష్ణు భగవానుడు కచ్ఛపరూపము (కూర్మరూపము) ధరించి మందరాచలమును తన వీపుపై ఉంచెను. అప్పుడు తిరిగి సముద్రమును మధించసాగిరి. దానినుండి హాలహల ప్రకటమయ్యెను. దానిని శంకర భగవానుడు తన కంఠమందు ధరించెను. దీనిచేత కంఠమున నల్లని మచ్చ ఏర్పడుటచే శంకర భగవానుడు నీలకంఠ నామముతో ప్రసిధ్ధుడయ్యెను.*
*ఆ తరువాత సముద్రము నుండి వారుణీదేవి , పారిజాత వృక్షము , కౌస్తుభమణి , గోవులు , అప్సరసలు , లక్ష్మీదేవి విష్ణుభవానుని చేరగా, సమస్త దేవతలు దర్శించి స్తుతించిరి , దీనివలన అందరూ లక్ష్మీ సంపన్నులయిరి.*
*అనంతరము అయుర్వేద ప్రవర్తకుడైన ధన్వన్తరి భగవానుడు అమృత కలశముతో ప్రకటమయ్యెను. దైత్యులా కలశమును లాగుకొని దాని నుండి సగము దేవతల కిచ్చి మిగిలినది తీసికొని జంభాది దైత్యులు వెళ్ళుచుండిరి. వీరు వెళ్ళుట గాంచిన విష్ణు భగవానుడు మోహినీ రూపము ధరించెను. రూపవతి అయిన ఈ స్త్రీని గాంచిన దైత్యులు మోహితులై *”సుముఖీ ! నీవు మాకు భార్యవై ఈ అమృతమును మాచే త్రాగించుము” అని కోరగా అట్లే అని మోహినీ రూపమున నున్న భగవానుడు ఆ అమృత కలశము గ్రహించి దేవతలచే త్రాగించుచుండెను. ఆ సమయమున రాహువు చంద్రుని రూపము ధరించి అమృతమును త్రాగుచుండెను. అప్పుడు సూర్య , చంద్రులు వాని కపట వేషమును ప్రకటించిరి. ఇది గాంచిన శ్రీహరి చక్రముతో వాని శిరస్సును ఖండించెను. కాని దయగలిగి మరల జీవింపజేసెను.*
*అప్పుడు రాహువు, శ్రీహరితో “ఈ సూర్యచంద్రులను నేను అనేక మారులు గ్రహణముగా పట్టెదను , ఆ గ్రహణ సమయమున జనులు ఏ కొద్ది దానము చేసినను , అది అక్షయమగును” అని చెప్పగా శ్రీహరి “తథాస్తు” అనెను.*
*ఆ తరువాత స్త్రీ రూపమును విష్ణు భగవానుడు త్యజించెను. కాని శంకర భగవానుడు “ఆ మోహినీ రూపమును మరల దర్శింపజేయు” మని కోరుకొనెను. అప్పుడు శ్రీహరి మరల మోహినీ రూపమును ధరించగా , శంకర భగవానుడు మాయతో మోహితుడై పార్వతిని విడిచి మోహిని వెంటపడెను. శంకరుడు ఉన్మత్తుడై మోహిని కేశములను పట్టుకొనెను. మోహిని కేశములని విడిపించుకొని వెళ్ళిపోయెను. శంకర భగవానుని వీర్యము పడినచోట శివలింగక్షేత్రములు మరియు బంగారు గనులు ఏర్పడెను. అనంతరము శంకర భగవానుడు ఇది మాయ అని గ్రహించి తన స్వరూపమున స్థితుడయ్యెను.*
*అప్పుడు శ్రీహరి శంకరునితో “రుద్రా ! నీవు నా మాయను జయించితివి. నామాయను జయించిన వాడవు నీవు ఒక్కడివే.* *దైత్యులకు అమృతము లభించనందువలన దేవతలు యుద్ధమందు వారిని జయించి తిరిగి స్వర్గమును పొంది” రనెను. దైత్యులు పాతాళమున ప్రవేశించి అచ్చట నుండి సాగిరి. దేవతల విజయ గాధను చదివెడివారు స్వర్గలోకమునకు వెళ్ళుదురు.*
