SGSTV NEWS online
Andhra PradeshCrime

ఫొటోలు బయటపెడుతుందని.. పెళ్లి అడ్డుకుంటుందని!వివాహిత హత్య కేసులో నిందితుడి అరెస్టు



ఉంగుటూరు, : తన వివాహానికి అడ్డుగా మారుతోందన్న కారణంతో.. ప్రియురాలైన వివాహితను హతమార్చిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చేబ్రోలు పోలీస్ స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. రావులపర్రుకు చెందిన పలివెల సంధ్యారాణి(41), ఆమె భర్త స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల గండికోట అజయ్కుమార్ తరచూ దుకాణానికి వచ్చేవాడు. ఈ క్రమంలో సంధ్యారాణితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అజయ్కుమార్కు తన మరదల్ని ఇచ్చి వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అప్పటి నుంచి సంధ్యారాణిని దూరం పెట్టాడు. పైగా హైదరాబాద్ వెళ్లిపోయి అక్కడే పని చేస్తున్నాడు.

పథకం ప్రకారమే..

సంధ్యారాణితో సంబంధం కొనసాగించడానికి అజయ్కుమార్ నిరాకరించడంతో.. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇరువురు కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు బయటపెట్టి వివాహానికి అడ్డంకిగా ఉంటుందని.. ఆమెను హతమారిస్తే ఇబ్బందులుండవని భావించాడు. హైదరాబాదులో కత్తి కొనుగోలు చేసి.. ఈ నెల 23న ఉదయం తాడేపల్లిగూడెం చేరుకున్నాడు. అక్కడ కారు అద్దెకు తీసుకుని, ప్రియురాలిని ఎక్కించుకుని నాచుగుంటలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ముందుగా తెచ్చుకున్న కత్తితో మెడపై పలుమార్లు దాడి చేసి హతమార్చాడు. ఒంటిపైనున్న బంగారు ఆభరణాలు లాక్కున్నాడు. ఆనవాళ్లు మాయం చేసేందుకు మృతదేహంపై పెట్రోలు పోసి దహనం చేశాడు.

అదృశ్యంపై ఫిర్యాదు

సంధ్యారాణి తాడేపల్లిగూడెంలోని ఆసుపత్రికి వెళ్తానని చెప్పడంతో ఆమె కుమారుడు ద్విచక్ర వాహనంపై 23న ఉదయం ఉంగుటూరు జాతీయ రహదారి కూడలిలో దించారు. ఎంతసేపటికి ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో అటవీ ప్రాంతంలో కాలిన స్థితిలో మృతదేహం ఉందని అటవీ బీట్ అధికారి రాజేశ్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సూర్యభగవాన్ మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ లభించిన ఆధారాలు, మహిళ అదృశ్యం ఫిర్యాదు ఆధారంగా మృతురాలు సంధ్యారాణిగా గుర్తించారు. నిడమర్రు సీఐ రజనీకుమార్ పర్యవేక్షణలో చేబ్రోలు, గణపవరం ఎస్సైలు సూర్యభగవాన్, మణికుమార్లు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. 26న అజయ్కుమార్ని రావులపర్రులో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి కత్తి, మృతురాలి బంగారు ఆభరణాలు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు డీఎస్పీ వెల్లడించారు.

Also read

Related posts