ఓఎల్ఎక్స్ మోసాల్లో ఆరితేరిన నిందితుడు
అమరావతి; రేపల్లె , : గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కరడుగట్టిన రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్లు కప్పి పరారైన ఘటన కలకలం రేపింది. నాలుగు రాష్ట్రాలకు వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న అతణ్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో తప్పించుకుని పారిపోయాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం నాగన్నగూడేనికి చెందిన నిందితుడు భీముడు అజిత్‌కుమార్ ఓఎల్ఎక్స్లో తనను తాను డీలర్‌గా పరిచయం చేసుకుని కార్లను విక్రయిస్తానంటూ వినియోగదారులను నమ్మించేవాడు. కొనుగోలుకు ఆసక్తి చూపించిన వారికి ఫోన్ చేసి వాహనం తన బంధువు వద్ద ఉందని చిరునామా చెప్పేవాడు. అక్కడికి వెళ్లిన కొనుగోలుదారుకు కారు నచ్చితే.. డబ్బులు తన ఖాతాకు బదిలీ చేయించుకునేవాడు.
అనంతరం ఫోన్ స్విచాఫ్ చేసేవాడు. ఒంగోలులో గ్రానైట్ వ్యాపారం చేసి అక్కడా మోసాలకు పాల్పడ్డాడు. మరి కొన్ని ఆర్థిక మోసాలూ చేశాడు. మొత్తం అతడిపై 32 కేసులుండగా ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పోలీసులకు వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. ఎట్టకేలకు ఇటీవల విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ నెల 24న తెనాలి పోలీసులు ఓ కేసుకు సంబంధించి అజిత్‌కుమార్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో రేపల్లె సబైజైలుకు తరలించారు. మధుమేహం, ఆయాసం, గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతున్న దృష్ట్యా వైద్యుల సిఫార్సు మేరకు 26న గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు.
అతడి బాధ్యతను ముగ్గురు ఏఆర్ పోలీసులకు అప్పగించారు.
ఆచూకీ చెప్పిన వారికి రూ.25 వేలు!
జీజీహెచ్ లో శనివారం ఉదయం కాపలాగా ఏఆర్ కానిస్టేబుల్ ఒక్కరే ఉన్నారు. ఉదయం అజిత్‌కుమార్ వాష్‌రూంకు వెళ్లాలని అడగడంతో పంపించారు. ఆ సమయంలో అల్పాహారం తీసుకుంటున్న ఆయన ఖైదీ వెంట వెళ్లలేదు. ఇదే అదనుగా అజిత్ బయటికి వచ్చి ఏసీ కళాశాల వైపు ఉన్న గేటు నుంచి వెళ్లి ఆటోలో పరారయ్యాడు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఏఆర్ పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వకులిందాల్ తెలిపారు. మూడు బృందాలు ఏర్పాటు చేశామని ఖైదీని త్వరలోనే పట్టుకుంటామన్నారు. అతడి ఆచూకీ తెలిపినవారికి రూ.25 వేల బహుమతి ఇస్తామని తెనాలి పోలీసులు ప్రకటించారు.
Also read
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్‌పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్‌చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..
- వారు బైక్‌పై ఇద్దరు వస్తున్నా.. రాత్రి సమయం అని ఇతనికి లిఫ్ట్ ఇచ్చారు.. కానీ కాసేపటికే..





