ລ້ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సాధించిన ఘనవిజయంపై ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటునారు. అయితే తెలంగాణ బీజేపీలో మాత్రం అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు ప్రాణత్యాగాలకు సైతం వెనకాడకుండా పోరాడుతుంటే.. తెలంగాణలో కొందరు నేతలు తమ స్వార్థం, ఈగోల కోసం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వేరే రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే ఇక్కడ టపాసులు కాల్చుకుంటూ సంబరాలు చేసుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఇంకా ఎన్ని సంవత్సరాలు వేరేవాళ్ల పెళ్లిళ్లలో మనం డ్యాన్సులు చేయాలి? మన ఇంట్లో పెళ్లి (తెలంగాణలో అధికారం) ఎప్పుడు చేసుకుంటాం?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని రాక్షస పాలనను ఎదిరించి బీజేపీ జెండా పాతడం వెనుక కార్యకర్తల బలమైన సంకల్పం ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. అక్కడ హిందూ సంఘాల కార్యకర్తలను చంపినా.. గుండా రాజ్యాన్ని ఎదుర్కొని ప్రాణాలకు తెగించి పనిచేశారని గుర్తుచేశారు. తెలంగాణలో కూడా అటువంటి పట్టుదల అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావుకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛనిస్తే రాష్ట్రంలో అధికారం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రామచంద్రరావు ఎవరి మాట వినకుండా.. నేరుగా ఢిల్లీలోని అమిత్ షా వంటి అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతూ ఫ్రీ హ్యాండ్ తో పనిచేయాలని ఆయన సూచించారు.
తెలంగాణలో బీజేపీ సర్వనాశనం అవ్వడానికి కొందరు నేతల ఈగోయిజం ప్రధాన కారణమని రాజాసింగ్ విమర్శించారు. ఢిల్లీ నుంచి వచ్చే నిధులను కొందరు నాయకులు ‘గాయబ్’ చేస్తున్నారని.. సరైన అభ్యర్థులకు అవి అందడం లేదని ఆరోపించారు. వేరే పార్టీల నుంచి నమ్మకంతో బీజేపీలోకి వచ్చిన నాయకులకు కనీస మర్యాద దక్కడం లేదని.. సీనియర్లను, కష్టపడే కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే పార్టీ నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “కొద్దిగా సిగ్గు ఉంటే బెంగాల్ గెలుపును చూసి నేర్చుకోండి. అక్కడ నాయకులు తమ ఈగోలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించారు.” అని ఆయన హితవు పలికారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కానీ నాయకత్వంలోని లోపాల వల్ల ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నామని రాజాసింగ్ విశ్లేషించారు. ఇప్పటికైనా నాయకులు తమ వైఖరి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా ఫలితం ఇలాగే ఉంటుందని హెచ్చరించారు. రామచంద్రరావు గారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి.. కార్యకర్తలను గౌరవిస్తే 100 శాతం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం వేరే రాష్ట్రాల విజయాలను చూసి మురిసిపోవడం మానేసి.. సొంత గడ్డపై జెండా పాతే దిశగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Also read
- సోషల్ మీడియా రీల్స్ పిచ్చి.. ఉమ్మెత్త పువ్వు కూర వండుకుని తిన్న కుటుంబం.. పరిస్థితి విషమం
- యూట్యూబ్‌లో చూసి ప్లాన్.. భార్యకు పాలకోవా తినిపించి..
- ఆమె ఓ యాంకర్.. పగలంతా హోస్టింగ్.. రాత్రయితే..
- రాత్రి బాయ్‌ఫ్రెండ్.. ఉదయం గర్ల్‌ఫ్రెండ్ సూసైడ్.. ఒక్క ఫోన్‌కాల్ ఎంత పని చేసిందో..!
- పక్కోడి పెళ్లిలో ఇంకెన్నాళ్లు డ్యాన్స్ చేస్తారు?.. తెలంగాణ బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైర్లు





