దొంగతనం అభియోగం మోపి 11 మందిని బట్టలూడదీసి చేతులను తాళ్లతో కట్టేసి కొట్టిన నిర్వాహకులు
బాధితులంతా ఎస్సిలు, బిసిలే
కృష్ణా జిల్లా, కంకిపాడు : కృష్ణా జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. నగదు దొంగిలించారనే అభియోగం మోపి కోడి పందేల బరి వద్ద నిర్వాహకులు 11 మంది చేతులను తాళ్లతో బంధించి బట్టలూడదీసి దాడి చేసి కొట్టారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఆటవిక ఘటన వెలుగుచూసింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానికుల కథనం ప్రకారం… సంక్రాంతి పండగ సందర్భంగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరులో భారీగా కోడి పందేల బరులు, జూద శిబిరాలు నిర్వహించారు. జూద శిబిరంలో పట్టా ఆటను మొవ్వ మండలం అయ్యంకి గ్రామానికి చెందిన పామర్తి గోపీచంద్ అనే వ్యక్తి ఏర్పాటు చేశారు. ఈ జూద శిబిరం వద్ద పనికి సహాయకులుగా మండల కేంద్రమైన తోట్లవల్లూరులోని ఎస్సి, బిసి సామాజిక తరగతికి చెందిన గొల్లపల్లి మధు, వల్లూరు సురేష్, పెనుమూడి వెంకటరత్నం, తోకల రాంబాబు, చింతా పాండు రంగారావు, అసరపల్లి శివశంకర్, తెర్ల దుర్గాప్రసాద్, ఎండి.షబ్బీర్, జోగి జగదీష్, బమ్మిశెట్టి వాసు, హరిప్రసాద్ అనే 11 మంది వ్యవసాయ కార్మికులను పెట్టుకున్నారు. శుక్రవారం కనుమ రోజు ఆట వద్ద నగదు లావాదేవీల్లో వ్యత్యాసం వచ్చింది. దీంతో, ఆట నిర్వాహకుడు పామర్తి గోపీచంద్‌తోపాటు మరో ఏడుగురు కలిసి ఈ 11 మంది కార్మికులను నిర్బంధించి అమానుషానికి పాల్పడ్డారు. కార్మికులను అర్ధనగంగా ఉంచి పత్రికల్లో రాయలేని విధంగా దుర్భాషలాడుతూ దాడి చేసి కొట్టారు. ఈ దృశ్యాన్ని కొందరు సెల్ఫోన్లో బంధించారు. శనివారం ఉదయం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అంతకు ముందు తోట్లవల్లూరుకు చెందిన గొల్లపల్లి మధు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కంకిపాడు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం… తోట్లవల్లూరుకు చెందిన గొల్లపల్లి మధు, పామర్తి గోపీచంద్ అనే వ్యక్తుల మధ్య ఆర్థిక లావాదేవీలపై వివాదం ఉంది. మధుతోపాటు మరో పది మంది కార్మికులు ఆటోలో గన్నవరం వెళ్తుండగా రైల్వే గేటు పడడంతో ఉప్పులూరు వద్ద ఆగారు. అక్కడ ఉన్న పామర్తి గోపీచంద్ అనే వ్యక్తి మద్యం మత్తులో డబ్బు లావాదేవీల విషయమై మధుతో ఘర్షణకు దిగారు. గోపీచంద్‌తోపాటు మరికొందరు కలిసి మధు, మరో పది కార్మికులను పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లారు. చొక్కాలు ఊడదీయించి చేతులను తాళ్లతో కట్టి తీవ్రంగా దుర్భాషలాడుతూ దాడి చేసి కొట్టారు. డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. ఈ మేరకు నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





