SGSTV NEWS online
Andhra PradeshCrime

కొలిమిగుండ్ల పోలీసుస్టేషన్లో లాకప్ మరణం!




మనస్తాపంతో ఉరి వేసుకున్నాడంటున్న పోలీసులు

కర్నూలు, -కొలిమిగుండ్ల, అవుకు: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల పోలీసుస్టేషన్లో దొమ్మరి వెంకటసుబ్బయ్య (39) అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున లాకప్లో మరణించడం సంచలనం సృష్టించింది. కొలిమిగుండ్ల మండలం బెలుం శింగవరానికి చెందిన వెంకటసుబ్బయ్య కంటికి బ్లాక్ఫంగస్ సోకడంతో చికిత్సకు భారీగా ఖర్చయింది. అప్పటికే అప్పులు ఉండడంతో తన బంధువు తేజ, నరేశ్ అనే మరో వ్యక్తితో కలిసి ఈ నెల 16న ట్రాక్టర్ దొంగిలించినట్లు పోలీసులు చెబుతున్నారు. కొలిమిగుండ్ల పోలీసులు శనివారం వెంకటసుబ్బయ్య, తేజలను అరెస్టు చేశారు. తేజ స్వగ్రామమైన తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పరగటూరు గ్రామ పరిసరాల్లో ట్రాక్టర్ ఉందని తెలిసి అక్కడికి వెళ్లి తీసుకొచ్చారు. వెంకటసుబ్బయ్యను, తేజను స్టేషన్ లోనే
ఉంచారు. నరేశ్ అనే మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున వెంకటసుబ్బయ్య కాలకృత్యాలకని స్టేషన్లోని మరుగుదొడ్లోకి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన తేజ.. మరుగుదొడ్డి తలుపును బలంగా తోశాడు. వెంకటసుబ్బయ్య లుంగీతో ఉరివేసుకుని కనపడటంతో పోలీసుల సాయంతో వెంటనే వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

పోలీసులు కొట్టడం వల్లేనని ప్రచారం

వెంకటసుబ్బయ్యను పోలీసులు కొట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. దొంగతనం చేసి దొరికిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కొలిమిగుండ్ల సీఐ ఎం. రమేశ్బాబు ‘మీడియా ‘కు వెల్లడించారు. తాము కొట్టడం వల్లే చనిపోయాడని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మృతుడి భార్య లక్ష్మి, కుమారుడు సుమంత్ కూడా వెంకటసుబ్బయ్య అవమానభారంతోనే ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.

టిడిపి , వైసీపీ నాయకుల పంచాయితీ?

వెంకటసుబ్బయ్యను రక్షించడంలో కొలిమిగుండ్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు రావడంతో కొందరు స్థానిక తెదేపా, వైకాపా నేతలు పంచాయితీ చేసినట్లు తెలుస్తోంది. పంచాయితీ పూర్తయ్యేవరకు వెంకటసుబ్బయ్య కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడకుండా పోలీసులు చూసుకున్నారు. నంద్యాల ఏఎస్పీ జావళి, డోన్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఎస్ఐలు అవుకు ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోనే సాయంత్రం వరకు ఉండి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

వైద్యఖర్చుల కోసమే..

పోలీసుల విచారణలో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. వెంకటసుబ్బయ్య ఎడమ కంటికి బ్లాక్ఫంగస్ రావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడని, ఇందుకు రూ.12 లక్షలు వెచ్చించాడని గుర్తించారు. అతనికి కొన్ని అప్పులుండటం, వైద్యం కోసం మరికొంత నగదు అవసరం కావడంతో ట్రాక్టర్ను దొంగిలించి విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలింది

Also read

Related posts