అడ్డాకుల, : ఆ దంపతులకు ఇటీవలె సంతానం కలిగింది. ఆనందంతో చిన్నారిని తీసుకుని మొక్కు చెల్లించుకునేందుకు ఆలయానికి వెళ్తున్నారు. అంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో తల్లినీ, నాలుగు నెలల పసికందును మృత్యువు కబళించిన విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగింది. అడ్డాకుల ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లికి చెందిన ప్రకాష్‌రెడ్డికి.. ఇదే జిల్లా శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామానికి చెందిన నందిని(25)తో రెండేళ్ల కిందట వివాహమైంది. వారికి నాలుగు నెలల కిందట కుమారుడు జన్మించాడు. దీంతో మొక్కు తీర్చుకునేందుకు చిన్నారితో పాటు దంపతులు కారులో యాదగిరిగుట్ట బయలుదేరారు. ఈ క్రమంలో అడ్డాకుల సమీపంలో పెట్రోల్ బంకు వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టారు. ముందు సీటులో ఎడమవైపు కూర్చున్న నందిని, ఆమె ఒడిలో ఉన్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న ప్రకాన్రెడ్డి గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుడిని వనపర్తి ప్రాంతీయ ఆసుపత్రికి, మృతదేహాలను మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. నందిని తల్లి అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..





