SGSTV NEWS online
Andhra PradeshCrime

మద్యం రవాణా కుంభకోణం కేసులో కారుమూరి సునీల్ అరెస్ట్



హైదరాబాద్: వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ ను ఈడీ గురువారం అరెస్టు చేసింది. దాంతో ఈ కేసులో ఈడీ అరెస్టు చేసిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ఈ కుంభకోణంలో ప్రభుత్వం తరపున అన్నీ తానై నడిపించిన రాజ్ కెసిరెడ్డిలను ఈ నెల 11న అరెస్టు చేసింది. సునీల్ కుమార్ తండ్రి మాజీ మంత్రి నాగేశ్వరరావుకు కూడా ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం పాలసీని అడ్డం పెట్టుకొని రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించడం, మామూళ్లు ముట్టజెప్పిన సంస్థలకే మద్యం అమ్మకాలకు అవకాశం ఇవ్వడం వంటి అవకతవలకు పాల్పడ్డ ప్రభుత్వ పెద్దలు భారీగా కూడబెట్టుకున్నట్లు సిట్ నిగ్గు తేల్చింది. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం దుకాణాలకు సరఫరాలోనూ వైకాపా ప్రభుత్వం చేతివాటం ప్రదర్శించింది. మద్యం పాలసీలో ఉల్లంఘనలతోపాటు రవాణా కుంభకోణానికి సంబంధించి ఈడీ వేర్వేరు కేసులు నమోదు చేసింది. ఇలా కొట్టేసిన సొమ్మును ఎటు మళ్లించారన్న అంశంపై దర్యాప్త మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే పలువురు నిందితులను విచారించిన ఈడీ అధికారులు ఈ నెల 11న వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డిలతోపాటు అప్పటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్కుమార్లకు చెందిన ఇళ్లు, వాసుదేవరెడ్డి బావమరిది నరసింహారెడ్డి, రవాణాకు వాహనాలు సమకూర్చిన శ్రీ సుదర్శన్ కంపెనీ ప్రతినిధి వల్లు సందీప్ ఇళ్లలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

బెవరేజస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా చేయడంలో దాదాపు రూ.195.33 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. రవాణా కాంట్రాక్టును తొలుత సిగ్మా సంస్థకు, దాన్నుంచి సుదర్శన్. సంస్థకు బదిలీ చేశారు. శ్రీ సుదర్శన్ సంస్థను నడిపించింది కారుమూరి సునీల్ కుమారేనని ఈడీ కూడా నిర్దారించింది. ఈడీ సోదాల్లో సునీల్ కుమార్ ఇంట్లో దీనికి కీలక ఆధారాలు లభించాయి. రెండు రోలెక్స్ వాచీలు, ఒక రేంజ్ రోవర్ కారు స్వాధీనం చేసుకోగా ఇవన్నీ మద్యం రవాణా కుంభకోణంలో ఆర్జించిన సొమ్ముతో కొన్నవేనని ఈడీ గుర్తించింది. వీటితోపాటు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఫోన్ లో ఒక కరెన్సీ నోటు బొమ్మను గుర్తించారు. హవాలా లావాదేవీలో భాగంగా జరిగిన చాటింగ్ లో ఈ నోట్ను పంపినట్లు ఈడీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మద్యం రవాణాకు సంబంధించి కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ ఒప్పందం కాపీని కూడా అధికారులు ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ విశ్లేషించి ఈ కుంభకోణంలో సునీల్ పాత్రపై ఈడీ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. గురువారం  ఉదయం ఫిల్మ్ నగర్ లోని ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు సునీల్ కుమార్ ను అరెస్టు చేసి, ఈడీ కార్యాలయానికి తరలించి విచారించారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలో
వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టు ఆదేశాల మేరకు చంచల్గూడ జైలుకు తరలించారు.

Also read

Related posts