November 21, 2024
SGSTV NEWS
CrimeNational

బెంగళూరులో ఢిల్లీ తరహా దారుణం.. యువతిని చంపి 32 ముక్కలు.. ఫ్రిజ్‌లో శరీర భాగాలు!




బెంగళూరు నగరంలో సంచలనం సృష్టించిన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 29 ఏళ్ల మహిళను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని 32 ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్‌లో దాచారు. ఈ హత్య 15 రోజుల క్రితం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశంలో, పోలీసులు ఆమె ఇంటి లోపల రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన మృతురాలి మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య వెనుక ఉద్దేశ్యం లేదా నిందితుల గురించి ఇంకా సమాచారం అందలేదు. హత్యకు గురైన బాధితురాలు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే ఆమె తన కుటుంబంతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ తెలిపారు.


మృతురాలి కుటుంబ సభ్యులు ఇంటికి రావడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని, భవనంలోని ఇరుగుపొరుగు వారు బంధువులకు తెలిపారు. దీంతో హత్యకు గురైన యువతి తల్లి, అక్క ఇంటికి వచ్చి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లగా హత్య జరిగినట్లు గుర్తించారు. మూడు నెలల క్రితమే నగరంలోని వాయాలికావల్ పైప్ లైన్ రోడ్డులోని వీరన్న భవన్ సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు.

ఈ ఘటనపై బెంగళూరు సెంట్రల్ డివిజన్ అదనపు పోలీసు కమిషనర్ సతీష్ మాట్లాడుతూ.. ఒకే వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నామన్నారు. మృతదేహం ముక్కలను సింగిల్ డోర్‌ ఫ్రిజ్‌లో ఉంచారు. మృతి చెందిన మహిళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహాలక్ష్మిగా గుర్తించారు. ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. భర్త నుంచి విడిపోయిన ఆ మహిళ ఒంటరిగా జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.


కాగా, 2022లో ఢిల్లీలోని మెహ్రౌలీలో శ్రద్ధా వాకర్ అనే బాలికను కూడా ఇదేవిధంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని 36 ముక్కలుగా నరికివేశారు. ఆ సమయంలో మృతుడి శరీర భాగాలను మెహ్రౌలీ అడవుల్లో విసిరేసిన దారుణ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది

Also Read

Related posts

Share via