రాజంపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి రాళ్లదాడికి పాల్పడడంతో, ప్రతీకారంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కడప జిల్లాలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజంపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి రాళ్లదాడికి పాల్పడడంతో, ప్రతీకారంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
ఈ ఘటనలో ఇంటి అద్దాలతో పాటు కారు, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసమైంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య పరస్పరం రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక టీడీపీ కార్యకర్తకు తలకు బలమైన గాయాలు అవ్వడంతో అతన్ని చికిత్స నిమిత్తం కడపకు తరలించారు. నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలతో రాజంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాళ్లు రువ్వుకున్నఇరు వర్గాలు : కడపలోని కాగితాలపెంట నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. గాంధీనగర్ పాఠశాల వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. నాగరాజుపేట, సెయింట్ జోసెఫ్, రాజంపేట నామినేషన్ కేంద్రాల్లోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరోవైపు మైదుకూరు పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్సీపీ – టీడీపీ వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు. నామినేషన్ల సందర్భంగా పులివెందులలో ఘర్షణ చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.
నామినేషన్ పత్రాల చించివేత : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ రాజంపేటలో హైటెన్షన్ నెలకొంది. రెండో రోజూ వైఎస్సార్సీపీ, తెలుగుదేశం వర్గాలు పరస్పరం అడ్డుకొని దాడులకు దిగడంతో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం కలకలం రేపాయి. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని వైఎస్సార్సీపీ అభ్యర్థులను అడ్డుకోవడంతో పాటు, వారి నామినేషన్ పత్రాలను చించివేశారు.
దీంతో మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా దొంగ చాటుగా వైఎస్సార్సీపీ నేతలు నామినేషన్లు వేశారు. నామినేషన్ దాఖలు చేసి తిరిగి వెళ్తున్న వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి నడిగడ్డ రేష్మ, ఆమె తండ్రిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడి విచక్షణారహితంగా కొట్టారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను చించివేయడం, దాడి ఆరోపణల నేపథ్యంలో రాజంపేటలొ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు : పులివెందులలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు లింగాల పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని లింగాల ఎస్సై జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం లింగాల మండలానికి చెందిన ప్రజలు ఎవరూ పులివెందులకు వచ్చి ఐదుగురికి మించి గుంపులుగా గుమికూడరాదని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసు శాఖ పనిచేస్తోందని, నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా గుంపులుగా తిరిగితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలందరూ పోలీసు శాఖకు పూర్తిగా సహకరించాలని ఎస్సై జగదీశ్వర్ రెడ్డి కోరారు.
మారణాయుధాలతో నేరగాళ్లు : కడపలో ఘర్షణల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. రవీంద్రనాథ్రెడ్డి, అంజాద్ బాషా సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రాయచోటిలో అంతర్రాష్ట్ర రౌడీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మారణాయుధాలతో సహా నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 పిస్టళ్లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి ఎన్నికల్లో అల్లర్లకు వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు.
Also read
- మద్యం రవాణా కుంభకోణం- కారుమూరి సునీలే ప్రధాన సూత్రధారి!
- వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థి ఇంట్లో తెలంగాణ మద్యం – ఇద్దరు అరెస్ట్
- రాయచోటిలో పంజాబ్ గ్యాంగ్ – ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు
- రాజంపేటలో తీవ్ర ఉద్రిక్తత – ఎమ్మెల్యే ఆకేపాటి ఇంటిపై దాడి
- ఆదివారం దుర్గాష్టమి వేళ అరుదైన యోగం.. ఈ రాశులకు బంపర్ జాక్ పాట్ తో పాటు ఉద్యోగంలో ప్రమోషన్.!.

