రాయచోటిలో అంతర్రాష్ట్ర రౌడీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మారణాయుధాలతో సహా నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు పిస్టళ్లు, బుుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ మారణాయుధాలతో అంతర్రాష్ట్ర ముఠా పట్టుబడటం కలకలం రేపుతోంది. పంజాబ్ నుంచి వచ్చిన 10 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 పిస్టళ్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్సులు లేని తుపాకులు, అక్రమ ఆయుధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిన్న రాయచోటిలోని నామినేషన్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ హల్చల్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.
నామినేషన్ల సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మదనపల్లి రోడ్డులోని ఓ లాడ్జిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, కర్ణాటక నుంచి వచ్చినవారు, బౌన్సర్లు మకాం వేసినట్లు సమాచారం అందడంతో తెలుగుదేశం కార్యకర్తలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో లాడ్జి పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ, తెలుగుదేశం వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగారు. ఘర్షణల్లో అక్కడే ఉన్న ఓ కారు ధ్వంసమైంది. పోలీసులు లాడ్జి వద్దకు చేరుకొని వైఎస్సార్సీపీ శ్రేణులు సహా కర్ణాటక వ్యక్తులు, బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద మారణాయుధాలు ఉన్నట్లు గుర్తించారు. పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మూడెంచెల భద్రతా వ్యవస్థ: రాయచోటిలో వరుస అల్లర్లు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోసారి అల్లర్లకు తావివ్వకుండా పెద్ద ఎత్తున భద్రతా బలాగలను మోహరించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు పట్టణానికి చేరుకున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాయచోటిలో ర్యాలీలు, ఆందోళనలను పోలీసులు నిషేధించారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి పట్టణంలో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు నామినేషన్ల నేపథ్యంలో కడప నగరంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగితాలపెంట నామినేషన్ కేంద్రం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. గాంధీనగర్ పాఠశాల వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. నాగరాజుపేట, సెయింట్ జోసెఫ్ నామినేషన్ కేంద్రాల వద్ద ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి.
Also read
- మద్యం రవాణా కుంభకోణం- కారుమూరి సునీలే ప్రధాన సూత్రధారి!
- వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థి ఇంట్లో తెలంగాణ మద్యం – ఇద్దరు అరెస్ట్
- రాయచోటిలో పంజాబ్ గ్యాంగ్ – ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు
- రాజంపేటలో తీవ్ర ఉద్రిక్తత – ఎమ్మెల్యే ఆకేపాటి ఇంటిపై దాడి
- ఆదివారం దుర్గాష్టమి వేళ అరుదైన యోగం.. ఈ రాశులకు బంపర్ జాక్ పాట్ తో పాటు ఉద్యోగంలో ప్రమోషన్.!.

