SGSTV NEWS online
CrimeNational

షికారుకు తీసుకెళ్లి ప్రియురాలి హత్య



కర్ణాటక: అనైతిక బంధాలు ఎలా విషాదాంతమవుతున్నాయో మరోసారి ఈ ఘటన చాటిచెప్పింది. జిల్లాలో జాతీయ రహదారి-948లో జవగనహళ్లి కొండ వద్ద నిర్జన ప్రాంతంలో గత నెల 22న లభించిన కాలిన స్థితిలో మహిళ మృతదేహం మిస్టరీని మళవళ్లి తాలూకా బెళకవాడి పోలీసులు ఛేదించారు. బెంగళూరులోని హారోహళ్లి కగ్గలీపురకు చెందిన నళిని (33)గా గుర్తించారు. స్థలంలో మహిళ చేతి గడియారం, ఉంగరం, హెయిర్ క్లిప్, ఇంటి తాళాలు లభించాయి.

ఆమె ప్రియుడు తమిళనాడు క్రిష్ణగిరి జిల్లాకు చెందిన ఉప్పారహళ్లి రాజశేఖర్ (30) అని తేలింది. నళినికి ఇదివరకే పెళ్లయి విడిపోయింది. బెంగళూరులోని జేపీనగరలో బ్యూటీపార్లర్లో పనిచేసేది. నళినికి ఓ గుడి వద్ద రాజశేఖర్ పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. తనను పెళ్లి చేసుకోవాలని నళిని ఒత్తిడి చేయగా, నీకు ఇదివరకే పెళ్లయిందని అతడు నిరాకరించేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండేది. నళిని తీరుతో కక్ష పెంచుకున్న రాజశేఖర్ మాయమాటలతో నళినిని గత నెల 22న కారులో షికారుకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపి నిప్పంటించి కాల్చి వేశాడు. తర్వాత రెండు రోజులకు మళ్లీ అక్కడకు వెళ్లి కాలిన స్థితిలో శవాన్ని చూసి వెళ్లాడు.

తల్లితో కలిసి నిందితుని ఆత్మహత్య

పోలీసుల దర్యాప్తు తీవ్రం కావడంతో భయపడిన రాజశేఖర్ గతనెల 28న సాయంత్రం తన తల్లితో కలిసి తమిళనాడులోని ఉప్పారహళ్లి వద్ద కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అదివరకే అతన్ని విచారించగా తనకేమీ తెలియదని చెప్పాడు. తరువాత నళిని స్నేహితురాలు శ్రేయా వారి ప్రేమ గురించి పోలీసులకు వివరించింది. దీంతో మిస్టరీ వీడింది. అయితే హంతకుడు కూడా చనిపోవడంతో కేసు క్లోజ్ చేశారు. ఎస్పీ శోభారాణి, డీఎస్పీ యశ్వంత్, సీఐ శ్రీధర్, ఎస్ఐ ప్రకాష్ కేసును పర్యవేక్షించారు.

Also read

Related posts