సంచార వాహనాన్నే లింగ నిర్ధారణ కేంద్రంగా మార్చుకుని ఊరూరా తిరుగుతూ అనైతిక కార్యకలాపాలకు తెగబడుతున్న ముగ్గురిపై ఖమ్మం జిల్లా చింతకాని పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
చింతకాని, న్యూస్టుడే: సంచార వాహనాన్నే లింగ నిర్ధారణ కేంద్రంగా మార్చుకుని ఊరూరా తిరుగుతూ అనైతిక కార్యకలాపాలకు తెగబడుతున్న ముగ్గురిపై ఖమ్మం జిల్లా చింతకాని పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగర పరిధిలోని అల్లీపురానికి చెందిన కాత్యాయని గతంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసేది. నగర శివారు బల్లేపల్లికి చెందిన ఆర్ఎంపీ చారి, చింతకాని మండలం కొదుమూరుకు చెందిన ఆర్ఎంపీ రాచబంటి మనోజ్ తమ వద్దకు వచ్చే రోగులను ఈమె పనిచేసే ఆసుపత్రికి రిఫర్ చేసేవారు. ఆ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అక్రమార్జనకు సిద్ధపడ్డ చారి ఆధ్వర్యంలో వీరు ఏడాది క్రితం ఓ కారు కొనుగోలు చేశారు. అందులో అల్ట్రాసౌండ్ స్కాన్ యంత్రం, ఇతర సామగ్రిని అమర్చుకున్నారు. ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్తూ గర్భంతో ఉన్న అమాయక గిరిజన మహిళలకు అందులోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారు. అక్కడ పరీక్షలు చేయించుకునేందుకు ఇష్టపడని వారిని బల్లేపల్లి, కొదుమూరులోని తమ క్లినిక్లకు తీసుకొచ్చేవారు. గర్భవిచ్చిత్తి కోసం ఇల్లెందులో ఓ ప్రైవేటు వైద్యుని వద్దకు పంపుతుండేవారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు చారి ఆచూకీ తెలిస్తేనే ఆ వైద్యుడెవరన్నది తేలే అవకాశమున్నట్టు సమాచారం.
టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 నెలలుగా వీరి కార్యకలాపాలపై నిఘా ఉంచారు. గురువారం నలుగురు మహిళల్ని కొదుమూరుకు తీసుకొచ్చిన క్రమంలో నిందితులు మనోజ్, కాత్యాయనిలను విచారించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్మీరా తెలిపారు.
Also read
- శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..
- Blood Moon on Holi: హోలీ రోజున ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్.. కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణం
- నేటి జాతకములు…14 మార్చి, 2025
- ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…
- XXX సోప్స్ అధినేత మృతి