SGSTV NEWS online
Andhra PradeshCrime

వివాహేతర సంబంధం.. భర్తను చంపిన భార్య



కర్నూలు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓమహిళ తన భర్తను కడతేర్చిన çఘటన ఆళ్లగడ్డ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన మహిళతో పాటు ఆమె ప్రియుడు, సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు నిందితుల వివరాలు వెల్లడించారు.

పట్టణంలోని ఆంజనేయులు (27)కు రుద్రవరం మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన సుబ్బులుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ క్రమంలో సుబ్బులుకు చాగలమర్రి మండలం తోడేండ్లపల్లె గ్రామానికి చెందిన గురుప్రసాద్ ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది.

విషయం తెలుసుకున్న ఆంజనేయులు భార్యను హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని సుబ్బులు తన ప్రియుడు గురుప్రసాద్లో కలిసి కుట్ర పన్నింది. ఈ మేరకు గురుప్రసాద్, అతని స్నేహితుడు షరీఫ్ ఆదివారం రాత్రి ఆంజనేయులను మద్యం తాగుదామంటూ నమ్మించి పాలసాగరం రోడ్డులోని మొక్కజొన్న పొలంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆంజనేయులకు మద్యం తాగించి తర్వాత రాళ్లతో తలపై మోది హత్య చేశారు. సోమవారం హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే మృతుడి భార్య ఏమి తెలియనట్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి దగ్గరున్న తన భర్తను పిలుచుకు పోయారని, తెల్లారే సరికి హత్య చేశారని నమ్మబలికింది. ఆమె మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా తన ప్రియుడితో కలిసి ఈ హత్య చేయించినట్లు ఒప్పుకుంది. దీంతో సుబ్బులు, గురుప్రసాద్ తో పాటు హత్య కు సహకరించిన షరీఫ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా హత్య జరిగిన ఒక రోజులోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ నాగరాజారావు, ఎస్ఐ చిన్న పీరయ్యను డీఎస్పీ అభినందించారు.

Also read

Related posts