April 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే వణకాల్సిందే.. పరారీలో ఆ ఇద్దరు.. రంగంలోకి పోలీసులు..

బెట్టింగ్‌ యాప్స్ కనిపిస్తే సెలబ్రిటీలు వణికిపోవాలా…! డబ్బుల కోసం ఆ యాప్స్‌ను ప్రమోట్‌ చేయాలంటే ఖాకీ దూకుడు అన్న సినిమా 70MMలో కనిపించాలా…! అంటూ బెట్టింగ్‌ యాప్స్‌పై ఫుల్‌ సీరియస్‌గా ముందుకెళ్తున్నారు పోలీసులు. మొక్కకి అంటు కట్టినట్లు ఓ పద్దతిగా బెట్టింగ్ బూజు దులుపుతున్నారు. మరిప్పటివరకూ నోటీసులందుకున్న వాళ్లెవరు…? విచారణకు హాజరైంది ఎంతమంది…? ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసుకుని పత్తాలేకుండా పోయిన లిస్ట్‌ సైజ్‌ ఎంత…? హాట్‌టాపిక్‌గా మారిన విష్ణుప్రియ, టేస్టీ తేజ విచారణ ఎంతవరకొచ్చింది..?


బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసి, యూత్‌ ఎమోషన్స్‌తో ఆడుకుని, వాళ్ల జీవితాలు నాశనం అయ్యేలా చేస్తున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల భరతం పడుతున్నారు పోలీసులు. అందులోభాగంగానే…యూట్యూబర్లు విష్ణుప్రియ, టేస్టీ తేజను మంగళవారం విచారణకు పిలిచారు. షూటింగ్‌లో ఉన్నాం… మీడియా ఉందన్న సాకుతో వాళ్లు విచారణకు డుమ్మా కొట్టారు. వాళ్లిద్దరి తరుఫున రంగంలోకి దిగిన ఆర్జే శేఖర్‌ భాషా.. సమయం కావాలని పోలీసులను కోరారు. దీంతో వాళ్లకు మరో మూడు రోజుల సమయం కేటాయించిప్పటికీ.. అందరికీ షాక్ ఇస్తూ నిన్న రాత్రే విచారణకు హాజరయ్యారు టేస్టీ తేజ. విష్ణుప్రియ మాత్రం విచారణకు వచ్చేందుకు పోలీసులిచ్చిన మూడ్రోజుల సమయానికే ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది…!

ఇకీ బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి…. విష్ణుప్రియ, టేస్టీ తేజతో పాటు సుప్రీత, రీతూ చౌదరి, హర్షసాయి, పరేషాన్‌ బాయ్స్‌ ఇమ్రాన్‌, కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్, బయ్యా సన్నీ యాదవ్‌, లోకల్‌బాయ్‌ నాని, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌, శ్యామలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. నోటీసులు ఇచ్చినవాళ్లలో కొందరు ఫోన్లు స్విచ్చాఫ్‌ చేయడంతో వాళ్ల కోసం పోలీసులు వేట షురూ చేశారు.


పరేషాన్‌ బాయ్స్‌ ఇమ్రాన్‌ను త్వరలోనే అరెస్ట్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇమ్రాన్‌ వీడియోలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ పోలీసులు చెబుతున్నారు. ఇక యూనిఫాంలో బెట్టింగ్‌ యాప్స్‌ని ప్రమోట్‌ చేసిన కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్‌పైనా కేసు నమోదైంది. అలాగే లోకల్‌ బాయ్‌ నాని అరెస్టవ్వగా.. బయ్యా సన్నీ యాదవ్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరికొందరి పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది… అప్పుడు బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్‌ చేశాం, ఇప్పుడు మానేశామని చెబుతున్నారు. ఏదిఏమైనా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్‌ చేసిన వారిని వదిలే ప్రసక్తేలేదంటున్నారు పోలీసులు. మొత్తంగా.. బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్‌ చేసిన సెలబ్రిటీలందరికి ఉచ్చు బిగిస్తున్నారు పోలీసులు.

పరారీలో ఆ ఇద్దరు..?
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఇప్పటికే 11మంది ఇన్‌ఫ్లూయెన్సర్లకు నోటీసులిచ్చారు. అయితే.. వీరిలో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, హర్షసాయి దుబాయ్‌కి పరారైనట్లు సమచారం.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి నిర్వాహకుల.. ఆధారాలను సేకరిస్తున్న పోలీసులు.. మరింత ఉచ్చు బిగించేందుకు సిద్ధమయ్యారు

Also read

Related posts

Share via