హైదరాబాద్ నగరంలో జరిగిన హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలు ఆరని చిన్నారి ప్రాణాలు వదిలింది. అనారోగ్యంతో తీసుకువచ్చిన శిశువుకు గడువు ముగిసిన మందులతో చికిత్స అందించడంతో మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు హాస్పిటల్ పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న క్రియాన్స్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తీసుకువచ్చిన ఆరు నెలల శిశువు మృతి చెందడం ఉద్రిక్తతకు దారి తీసింది. విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి తన ఆరు నెలల ముద్దుల కొడుకును అనారోగ్యంతో హాస్పిటల్కు తీసుకువచ్చారు. వైద్యులు చికిత్సలో భాగంగా మందులు అందజేశారు. మందులు ఇచ్చిన కొద్దిసేపటికే శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఆ మందులు గడువు ముగిసినవని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బాలుడు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. కొంతమంది కోపోద్రిక్తులై హాస్పిటల్ ఆస్తులను ధ్వంసం చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హాస్పిటల్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. శిశువు మృతికి గల అసలు కారణాలపై పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా కు తరలించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Also read
- శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు.. భక్తికి ఉన్న శక్తి ఇదే!
- పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? నేటి పేర్లు ఇవే!
- Mala Japa Rules: జపమాలతో మంత్రం జపిస్తున్నారా?.. ఈ చూపుడు వేలు నియమం మీకు తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు





