వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రియాంక మోల్ అనే మహిళ బంధువులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించాల్సిన విహారయాత్ర క్షణాల్లోనే విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ట్రెక్కింగ్‌కు వెళ్లి ఓ మహిళ సడెన్ మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా అనంతగిరిలో విషాదం నింపింది. బంధువులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందడం కలచివేసింది. హైదరాబాద్ కంచన్‌బాగ్‌కు చెందిన ప్రియాంక మోల్ మహిళ.. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. వారాంతపు సెలవు కావడంతో మరో ముగ్గురు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం అనంతగిరి అటవీ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు. తొలుత నందిఘాట్ పరిసరాల్లో పర్యటించారు. ఆ తర్వాత.. ట్రెక్కింగ్ చేస్తూ వ్యూపాయింట్ దగ్గరకి వెళ్లి అనంతగిరి అటవీ ప్రాంతాన్ని తిలకించారు.
ఈ క్రమంలో.. ప్రియాంక మోల్ తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ప్రియాంక గుండెపోటుతో మృతిచెందినట్లు తెలిపారు. దీంతో.. అప్పటివరకు తమతో సరదాగా గడిపిన ప్రియాంక మోల్ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడపాల్సిన విహారయాత్ర క్షణాల్లోనే విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా.. ట్రెక్కింగ్‌కు వచ్చే పర్యాటకుల్లోనూ ఆందోళన కలిగించింది.
కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, బీపీ, షుగర్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అలర్ట్‌గా ఉండాలంటున్నారు.
Also read
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్‌ను విచారిస్తున్న సిట్
- అంకిత భండారి హత్య కేసు – ఆమె కుటుంబం CBI విచారణ కోరుతోంది
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!



