SGSTV NEWS online
CrimeTelangana

గుప్త నిధుల కోసం ఒక ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు.. చివరకు..



ఓ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని ముగ్గురు వ్యక్తులు కలిసి వెళ్లారు. గుప్తనిధుల కోసం భారీ తవ్వకాలు చేపట్టారు. మూడు వైపుల గుంతలు తీశారు. ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే విద్యుత్ షాక్‌తో చనిపోయాడని మరో ఇద్దరు వ్యక్తులు చెబు తున్నారు. మృతుని కుటుంబ సభ్యులు మాత్రం నరబలి అంటూ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కండ్లపల్లిలో నవత అనే మహిళ ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని నమ్మి.. మొగిలి అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు రాజేష్, సోమయ్యలు నిధుల తవ్వకం కోసం వెళ్లారు. అక్కడ మూడు వైపులా భారీ సైజులో గుంతలు తీశారు. ఈ క్రమంలో గుంతలు తవ్వుతున్న సందర్భంగా మొగిలి విద్యుత్ షాక్‌తో కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత విద్యుత్ షాక్‌తో చనిపోయాడంటూ మృతుని కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. అయితే  నరబలి ఇచ్చి.. విద్యుత్ షాక్ అని అబద్ధాలు చెబుతున్నారని మొగిలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సమాచారం అందండంతో.. పోలీసులు గుప్తనిధులు తవ్విన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ మూడు వైపులా తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించారు. అంతేకాకుండా వివిధ రకాల పూజ సామాగ్రిని కూడా అక్కడ గుర్తించారు. ఇంటి యాజమాని నవతను కూడా పోలీసులు విచారించారు.

ఈ ముగ్గురు వ్యక్తులు గుప్తనిధులు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా తమ దగ్గరికి వస్తున్నారని నవత పోలీసులకు చెప్పారు. దీంతో నిజమే అని నమ్మి తవ్వకాలు చేపట్టడానికి అనుమతి ఇచ్చానంటూ ఆమె వివరించారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. గుప్తనిధులు తవ్విన ప్రాంతంలోనే కొన్ని విద్యుత్ తీగలు ఉన్నాయి. విద్యుత్ తీగలతో చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో వెళ్లడైంది కానీ, మొగిలి కుటుంబ సభ్యులు మాత్రం నరబలి అని చెబుతున్నారు. గుప్త నిధుల తవ్వకాలకు వెళ్లిన కారణంగానే చంపి ఉంటారని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల చాలా ప్రాంతాల్లో గుప్తనిధుల ముఠా సంచరిస్తుంది. ఎక్కడైతే పురాతన ఆలయ కట్టడాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ తవ్వకాలు చేపడుతున్నారు. గతంలో అనేక కేసులు నమోదైనప్పటికీ ఈ ముఠా కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు. ఎవరైనా గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం చేస్తే నమ్మవద్దని మాకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

Also Read

Related posts