పురాతన, చారిత్రక ప్రాంతాలు, ఆలయాలు, కట్టడాలకు నిలయం ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఆనాటి రాజులు నిధి, నిక్షేపాలను వారు కట్టించిన కోటగోడల కిందో.. లేక దేవాలయాల్లో దాచి ఉంచి ఉంటారన్న అపోహలు ఉన్నాయి. ఈ గుప్త నిధుల కోసం కొందరు ముఠాగా ఏర్పడి తవ్వకాలు జరుపుతున్నారు. తాజాగా గుప్త నిధుల కోసం తవ్వకాలకు పాల్పడుతున్న ముఠాను తుర్కపల్లి పోలీసులు అరెస్టు చేసి కటకటాలపాలు చేశారు.
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ లో కొంత వ్యవసాయ భూమిని హైదరాబాద్ కు చెందిన ఒకరు కొనుగోలు చేశారు. అతను తన వ్యవసాయ భూమికి సూపర్ వైజర్ గా ఈసీఐఎల్ చెందిన పులి కుమార స్వామినీ నియమించుకున్నాడు. ఈ వ్యవసాయ భూమిలో చిన్నపాటి గుట్ట ఉంది. ఈ గుట్టపై ఆంజనేయుడు విగ్రహం కూడా ఉంది. సూపర్ వైజర్ గా పని చేస్తున్న కుమారస్వామికి నెలసరి వేతనం సరిపోడం లేదు. ఈజీ మనీ కోసం ఓ పథకం వేశాడు. ఆంజనేయుడి విగ్రహం కింద భూమిలో గుప్తనిధులు ఉంటాయని కుమారస్వామి భావించాడు. విజయవాడకు చెందిన రామినేని కృష్ణా కిషోర్, పాబోలు శ్రీనివాస్, ఆకుల నరసింహ రావు, ఖమ్మంకు చెందిన తాత కృష్ణకాంత్, బొమ్మల రామారంకు చెందిన వేణులతో కలిసి ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ కలిసి గుప్తనిధుల కోసం వేట సాగించారు.
ఆంజనేయుడు విగ్రహం కింద గుర్తు చప్పుడు కాకుండా గుప్తనిధుల కోసం తవ్వకాలను చేపట్టారు. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా వ్యవసాయ భావి కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు ప్రచారం చేశారు. ప్రత్యేక పూజలు చేసి హిటాచితో తవ్వకాలను చేపట్టారు. అయితే గ్రామానికి చెందిన కొందరికి ఈ తవ్వకాలపై అనుమానాలు కలిగాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు. తవ్వకాలకు వినియోగించిన హిటాచీ, కారు, పూజా సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాలు, క్షుద్ర పూజల పేరుతో గుప్త నిధుల తవ్వకాలను చేపట్టడం నేరమని పోలీసులు చెబుతున్నారు. గుప్తనిధుల పేరుతో ఎక్కడైనా తవ్వకాలు జరిపితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





