SGSTV NEWS online
CrimeTelangana

కన్నకూతురు చనిపోయిందని వెక్కి వెక్కి ఏడుస్తున్న తల్లి.. అనుమానంతో ఆరా తీస్తే షాకింగ్ నిజం!




రంగారెడ్డి జిల్లా, కొత్తూర్‌: కన్నకూతురు తరచూ ఫోన్‌లో మాట్లాడుతోందనే కారణంతో ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. పలుమార్లు మందలించినా ప్రవర్తన మార్చుకోవడం లేదనే కోపంతో 14 ఏళ్ల కుమార్తె గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం నేరాన్ని కప్పిపుచ్చేందుకు బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

షాద్‌నగర్‌ జోన్‌ డీసీపీ శిరీష రాఘవేందర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌ మండల కేంద్రానికి చెందిన రాజు, విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కుమార్తె (14) తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటంతో తల్లి విజయలక్ష్మి పలుమార్లు మందలించింది. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తల్లి ఆగ్రహం పెంచుకుంది.

అక్టోబర్ 27న రాజు, విజయలక్ష్మి పని నిమిత్తం బయటకు వెళ్లారు. సాయంత్రం విజయలక్ష్మి ఒక్కతే ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో కుమార్తె పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఫోన్‌ చూస్తూ కనిపించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విజయలక్ష్మి కుమార్తె గొంతు నులిమింది. ఊపిరాడక బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం భర్త రాజుకు ఫోన్‌ చేసిన విజయలక్ష్మి.. తాను ఇంటికి వచ్చేసరికి కుమార్తె ఉరివేసుకుని కనిపించిందని చెప్పింది. దీంతో ఇంటికి చేరుకున్న రాజు బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు విజయలక్ష్మిని విచారించారు. చివరకు తానే కుమార్తెను హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కేవలం ఫోన్‌లో మాట్లాడుతోందనే కారణంతో కన్నకూతురి ప్రాణాలు తీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Also read

Related posts