మిర్యాలగూడలో జరిగిన అగ్నిప్రమాదం వెనుక దారుణ హత్యాకాండ వెలుగుచూసింది. మొదట ప్రమాదంగా భావించిన ఈ ఘటనలో వృద్ధ మహిళ, ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. లోతైన విచారణలో ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన నేరమని పోలీసులు గుర్తించారు. కుటుంబ విభేదాలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో నిందితుడు పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు..
హైదరాబాద్, జూన్ 21: అభం శుభం తెలియని వయసులో ఆమెకు పెళ్లి చేశారు. కళ్లుమూసి తెరిచేలోపు ఇద్దరు పిల్లలు కలిగారు. బతుకంటే ఏమిటో తెలుసుకునేలోపు భర్త తాగుడుకు బానిసై అనారోగ్యంతో కన్నుమూశాడు. తోడుంటాడని నమ్మి మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంటే కన్నపిల్లలను, కట్టుకున్న ఇల్లాలిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మిర్యాలగూడ పట్టణంలోని కలల్‌వాడ కాలనీలో జూన్ 5న రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఓ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో వనం చంద్రమ్మ అలియాస్ చంద్రకళ (50), ఆమె మనువడు నక్కా లక్ష్మణ్ (16), మనవరాలు నక్కా ప్రణతి (14) సజీవ దహనమైన సంగతి తెలిసిందే. తొలుత ఇది ప్రమాదమనే అందరూ అనుకున్నారు. అయితే ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ సేకరించిన సాంకేతిక ఆధారాలు షాకింగ్ విషయాలు వెల్లడించాయి. పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. అది ప్రమాదం కాదని, పక్కా స్కెచ్‌తో పెట్రోల్ పోసి తగలబెట్టి ప్రమాదంగా చిత్రీకరించినట్లు తేల్చారు. చంద్రకళ కుమార్తె ధనమ్మ మొదటి భర్త తాగుడుకు బానిసై అనారోగ్యంతో మృతిచెందడంతో.. ఆమె తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటుంది. వివాహ వేదిక యాప్ ద్వారా కారు డ్రైవర్ కాళహస్తి శిరీశ్ కుమార్‌తో ధనమ్మకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ 2023లో నరసరావుపేటలో రహస్యంగా వివాహం చేసుకున్నారు.
కలల్‌వాడలో ఇల్లు నిర్మాణం విషయమై ఈ జంట గొడవ పడ్డారు. దీంతో శిరీశ్ కుమార్‌ను ధనమ్మ దూరం పెట్టింది. అయితే శిరీశ్ కుమార్ వివాహ వేదిక యాప్ ద్వారా మరో మహిళను నమ్మించి ఆమె బంగారం తీసుకుని మోసం చేయడంతో మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మే నెలలో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. జైలు నుంచి విడుదలయ్యాక ధనమ్మపై పగ పెంచుకున్నాడు. అటు ధనమ్మ తన పిల్లలను తల్లి చంద్రమ్మ వద్ద ఉంచి బతుకుదెరువు కోసం ఇటీవల పుణేలో కేర్‌టేకర్‌గా వెళ్లింది. ఇంట్లో ధనమ్మ లేని సమయం కావడంతో శిరీశ్ జూన్ 5న అర్థరాత్రి శిరీశ్ కుమార్ ఓ క్యాన్‌లో పెట్రోల్ తీసుకుని ఇంట్లోకి ప్రవేశించి.. గాఢనిద్రలో ఉన్న చంద్రమ్మ, పిల్లలు లక్ష్మణ్, ప్రణతిలపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో నిందితుడి చేతికి కూడా మంటలు అంటుకుని కాలిన గాయాలయ్యాయి. సంఘటన సమయంలో ధనమ్మ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. నిందితుడు శిరీశ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- పెళ్లికి నిరాకరించిందని యువతిపై హత్యాయత్నం
- ఫోన్ లాక్కొని పరిగెత్తాడు.. కొద్ది దూరం వెళ్లి కుప్పకూలాడు! ఏమైందా అని వెళ్లి చూస్తే..
- మిర్యాలగూడ సజీవ దహనం కేసులో ట్విస్ట్.. అది ప్రమాదం కాదు.. పక్కా స్కెచ్!
- రాత్రి వేళ రోడ్డుపై అనుమానాస్పదంగా మహిళ.. ఏంటా అని ఆరా తీయగా..
- నీట్ రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి





